AUTO ACCIDENT DEAD BODY FOUND: నెల్లూరు జిల్లా సంగం మండలంలోని బీరాపేరు వాగు వద్ద ఈ నెల 9వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదం జరగడంతో.. వాగులోపడి గల్లంతయిన ఐదుగురిలో నిన్న ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. ఈ రోజు తెల్లవారు జామున కర్రా పద్మ అనే మరో మహిళ మృతదేహం లభ్యమైంది. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
అసలు ఏం జరిగిందంటే..?
నెల్లూరు-ముంబయి జాతీయ రహదారిపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. మెుత్తం అయిదుగురు గల్లంతయ్యారు. మిగిలిన ఏడుగురిలో ముగ్గురు ఈదుకుంటూ బయటకు రాగా.. మరో నలుగురిని స్థానికులు, పోలీసులు రక్షించారు. వీరిలో నాగవల్లి (14) అనే బాలిక మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
ఆత్మకూరు జ్యోతినగర్‌కు చెందిన కె.నాగభూషణం కుటుంబసభ్యులు సంగంలోని సంగమేశ్వరాలయంలో నిద్ర చేసేందుకు ఆటోలో బయలుదేరారు. బీరాపేరు వాగు వంతెన పైకి చేరుకోగానే.. ఎదురుగా వచ్చిన రెండు లారీలు ఒకదానికొకటి అధిగమించే క్రమంలో ఆటోను ఒక లారీ ఢీకొట్టింది. దాంతో ఆటో 15 అడుగుల దిగువనున్న వాగులో పడిపోయింది.అటుగా వెళ్తున్న వారు గమనించి.. పోలీసులకు తెలిపారు. నందు, నాగసాయి, నాగభూషణం అనే యువకులు ఈదుకుంటూ వాగులోంచి బయటకు చేరుకున్నారు. లక్ష్మీదేవి, కృష్ణకుమారి, నాగవల్లి, నవదీప్ అనే నలుగురిని స్థానికులు, పోలీసులు బయటకు తీసుకొచ్చారు. సంపూర్ణమ్మ, పుల్లయ్య, నాగరాజు, పద్మ, ఆదెమ్మ వాగులో గల్లంతయ్యారు.
వీరిలో రెండు మృతదేహాలు నిన్న లభ్యమయ్యాయి. ప్రమాద స్థలానికి కిలోమీటర్ దూరంలో కర్రా పుల్లయ్య, కర్రా నాగరాజు మృతదేహాలను గుర్తించారు. కర్రా పద్మ అనే మరో మహిళ మృతదేహం ఇవాళ లభ్యమైంది. మిగిలిన ఇద్దరి కోసం ప్రత్యేక బలగాలు గాలిస్తున్నాయి.
ఇదీ చదవండి:
Kidnap: స్కూటీపై వచ్చి.. ఆడుకుంటున్న బాలికను ఎత్తుకెళ్లిన మహిళలు..!