ఎన్నికల ప్రచారంలో రైతుభరోసా పేరుతో జగన్ అనేక గొప్పలు చెప్పారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కేంద్ర పథకంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం..? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులు వీళ్లు ఎలా వాడుకుంటారని..? నిలదీశారు. కేంద్రం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు వేస్తోందన్న చంద్రబాబు... ఆ పేరును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. నవరత్నాలు కాస్తా నవగ్రహాలుగా తయారయ్యాయని చంద్రబాబు ఎద్దేవా చేశారు.
రైతుభరోసా కింద రూ.12,500 ఇస్తామని ఊదరగొట్టారన్న చంద్రబాబు... రైతులకు నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తామని గొప్పలు చెప్పారని విమర్శించారు. ఇప్పుడేమో కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కలిపి ఇస్తామంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్ రైతుభరోసా-పీఎం కిసాన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేంద్రం పేరు కలపాలన్న భాజపా డిమాండ్ వల్లే రైతుభరోసా పేరు మార్చారని పేర్కొన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మరో మోసం చేస్తున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం వాయిదాల ప్రభుత్వంలా మారిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండీ... 'వైకాపా బాధితుల తరఫున మేమే పోరాడతాం'