Airports in AP: నెల్లూరు జిల్లా దగదర్తి రైతుల పరిస్థితి.. రాజధాని అమరావతి అన్నదాతల్లా మారింది. దగదర్తిలో విమానాశ్రయం వస్తుందని..ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని.. ఆశగా ఎదురుచూస్తున్న వారి ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. 2019లో తెలుగుదేశం హయాంలో ఇక్కడ విమానాశ్రయ నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ చేశారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేసేలా విమానయాన సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. సమీపంలోని కృష్ణపట్నం పోర్టు, అనేక పరిశ్రమలకు ఉపయోగంగా ఉంటుందని నిపుణులు భావించారు.
సుమారు 1352 ఎకరాలు సర్వే చేశారు. 800ఎకరాలకు సంబంధించి రైతులకు పరిహారం అందజేశారు. భారీగా.. ఖర్చు చేశారు. అయితే తాజాగా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం జిల్లా నుంచి, నెల్లూరులో చేరిన కందుకూరు కందుకూరు నియోజకవర్గం తెట్టు అటవీ భూముల్లో విమానాశ్రయం ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది.
ఇటీవల జిల్లా కలెక్టర్‌తో పాటు, విమానాశ్రయ అధికారులు ఇక్కడి భూములను పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూస్తున్న దగదర్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్లుగా పంటలు సాగు చేసుకోనివ్వకుండా విద్యుత్ కనెక్షన్‌లు తొలగించారని.. పొలాలన్నీ సాగుకు పనికిరాకుండాపోయాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ నుంచి భూములు సేకరించిన తర్వాత విమానాశ్రయాన్ని మార్చడం సమంజసం కాదని వాపోతున్నారు. బతుకులు బాగుపడుతాయని భూములిచ్చామని, దగదర్తిలోనే విమానాశ్రయం నిర్మించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి: