వినాయకచవితి వచ్చిందంటే కర్నూలు నగరంలో వాడవాడలా తొమ్మిదిరోజులపాటూ సందడి నెలకొనేది. నిమజ్జనం రోజున వీధులన్నీ జనసంద్రమయ్యేవి. వేకువజామున వరకూ నిమజ్జనాలు కొనసాగుతుండేవి. పూజలందుకున్న గణపతులందరూ గంగమ్మ ఒడికి చేరుకునే ప్రక్రియ కోలాహలంగా జరిగేది. కరోనా నేపథ్యంలో గతేడాది వేడుకలు నిర్వహించలేదు. ఈ ఏడాది కోర్టు అనుమతితో పండుగ జరుపుకున్నా... పెద్దసంఖ్యలో విగ్రహాలు ఏర్పాటు చేయలేదు. కేవలం 600 వరకు మాత్రమే విగ్రహాలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఈ బొజ్జగణపయ్యలు నిమజ్జనానికి సిద్ధమయ్యారు.
పూజా కార్యక్రమాల అనంతరం...
నగరంలోని రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి స్థానిక ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమం నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాతే నగరంలో ఏర్పాటు చేసిన మిగిలిన విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరుతాయి. నగరంలోని పాత నగరం, బళ్లారి చౌరస్తా, నంద్యాల చెక్ పోస్టులు, పలు ప్రాంతాల నుంచి నగరంలోని వినాయక ఘాట్ వద్దనున్న కేసీ కాలువలో నిమజ్జనానికి రానున్నాయి. మొదట కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పరిపాలన గణపతి విగ్రహం ముఖ్య అతిథుల చేతులమీదుగా నిమజ్జనం చేస్తారు. ఆ తరువాతే మిగిలిన విగ్రహాలను క్రేన్ సహాయంతో నిమజ్జనాలు చేస్తారు.
ప్రోత్సాహకాలు ప్రకటన...
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో... సంప్రదాయబద్ధంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే మండప నిర్వాహకులకు పోలీసు శాఖ ప్రోత్సహకాలు ప్రకటించారు. ప్రథమ బహుమతి ఐదు వేలు ఇస్తామని చెప్పారు. ద్వితీయ, తృతీయ పతకాలూ ఉంటాయన్నారు. దీంతో ఉత్సవ్ కమిటీలు సంప్రదాయ నిమజ్జనానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. డీజేలకు అనుమతి లేదని... నగరంలో రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయని కర్నూలు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నిమజ్జన ఉత్సవాలు తిలకించేందుకు పెద్దఎత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రానున్నారు.
ఇదీచదవండి.