తెదేపా నేత, ఎమ్మెల్యే, సినీ నటుడు.. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలు చేశారు. నిరుపేదలకు వస్త్రాల పంపిణీ, అన్నదానం, మెుక్కలు నాటటం.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో..
బాలకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో.. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు, తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక షిరిడీ సాయిబాబా ఆలయంలో 61 టెంకాయలు కొట్టారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. పేద మహిళలకు చీరల పంపిణీ చేశారు. బాలకృష్ణ నివాసం వద్ద తెదేపా శ్రేణులు అన్నదానం నిర్వహించి.. పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. స్థానిక వృద్ధాశ్రమానికి నిత్యావసర సరకులు అందించారు.
కర్నూలు జిల్లాలో..
నందమూరి బాలకృష్ణ 61వ జన్మదిన వేడుకలను కర్నూలులో ఆయన అభిమానులు, తెదేపా నాయకుల మధ్య ఘనంగా నిర్వహించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కేక్ కట్ చేశారు.
కడప జిల్లా
కడప జిల్లాలో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను తెదేపా నేతలు ఘనంగా నిర్వహించారు. కడపలోని అనాథ శరణాలయంలో దుస్తులు పంపిణీ చేశారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అన్నదానం చేశారు.
విశాఖ జిల్లా
విశాఖ జిల్లా సింహాచలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా తెదేపా నాయకులు, అభిమానులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుంటూరు జిల్లా
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మందికి సేవ చేశారని నేతలు కొనియాడారు.
కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా నందిగామ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా
సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని వాత్సల్య అనాథ ఆశ్రమంలో కేక్ కట్ చేసి.. చిన్నారులు మిఠాయిలు పంచారు. అనంతరం చిన్నారులతో కలసి తెదేపా నేతలు సహపంక్తి భోజనం చేశారు.
ప్రకాశం జిల్లా
ప్రకాశం జిల్లాలో తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో అభిమానులు.. పేదలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: మహిళపై లైంగిక దాడికి యత్నం.. అటుపై కత్తితో దాడి