TDP LEADERS HOUSE ARREST: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామనే భయంతోనే.. వైకాపా ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కాలని చూస్తోందని తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నారు. తెలుగుదేశం నిజనిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో.. కర్నూలు జిల్లా పత్తికొండ, ప్యాపిలి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఇసుక, ఎర్ర మట్టి తరలింపు అంశంపై పరిశీలనకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.
''కర్నూలు జిల్లా ప్యాపిలి, పత్తికొండలో మట్టి తవ్వకాల విషయంలో అక్రమాలు జరిగాయని అధికార పార్టీ చేస్తున్న వ్యవహారాలే స్పష్టం చేస్తోంది. నిర్ధారణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మట్టి తవ్వకాల పరిశీలనకు వెళుతున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదు. ప్రతిపక్ష పార్టీల నేతలను టెర్రరిస్టుల్లా చూస్తున్నారు. ఎన్నిసార్లు అరెస్టులు చేసినా మేం తగ్గం. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం చేస్తున్న చర్యలు సరికాదు. నేతల అరెస్టు మట్టి అక్రమాలకు నిదర్శనం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. వారే ప్రజలు బుద్ధి చెప్తారు.'' - పయ్యావుల కేశవ్, ఉరవకొండ తెదేపా ఎమ్మెల్యే
ఆయనను హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న తెదేపా శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమాలను పరిశీలించడానికి వెళుతున్న నాయకులను గృహనిర్బంధం చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. దీనికి తోడు.. కమిటీలోని ఇతర సభ్యులైన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి సహా పలువురు నాయకులను పోలీసులు ఇళ్లవద్దనే నిర్బంధించారు.
రాష్ట్రంలో అవినీతి అరాచక శక్తులు పాలన సాగిస్తున్నాయని, ప్రశ్నించడానికి ఎవరూ ఉండకూడదనే కుట్రపూరిత ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతోందని విమర్శించారు. ఇలాంటి పాలన ఎక్కువ రోజులు సాగదని.. దీనిని ప్రభుత్వ పెద్దలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రతిపక్షంలో ఉన్న తాము పోరాడతామని ప్రభాకర్ చౌదరి తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి: CPI Ramakrishna: జగన్ ఆ పని చేయకుంటే పోరాటమే : సీపీఐ రామకృష్ణ