కర్నూలు జిల్లా రాయలసీమ విశ్వవిద్యాలయం గ్రంథాలయం ముందు సీమ ఉద్యమకారుడు జలం శ్రీను బెస్త రెండో వర్థంతిని ఘనంగా నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు సీమకృష్ణ, ఆర్వీపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర, ఏపీఎస్ఎఫ్ఆర్యూ అధ్యక్షుడు నవీన్, ఆర్వైఎస్ఎఫ్ రంగముని నాయుడు నివాళులు అర్పించారు.
గొప్ప ఉద్యమకారుడు..
రాయలసీమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయంపై ఘర్షణ ధోరణిలో తీస్తున్న సినిమాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప ఉద్యమకారుడు జలం శ్రీను అని బిసీ సంఘం నేత బాలక్రిష్ణ కీర్తించారు. ప్రముఖ ఛానల్ డిబేట్‌కి ఆహ్వానించిన నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆశయాలను కొనసాగిస్తాం..
జలం శ్రీను ఆశయాలను రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి సమైఖ్య విభాగం కొనసాగిస్తుందని అధ్యక్షుడు సీమకృష్ణ స్పష్టం చేశారు. జలం శీనన్న ఆశయాల కోసం విద్యార్థులంతా కృషి చేస్తామన్నారు. రాయలసీమపై అసభ్యకరమైన సినిమాలు తీసిన వాటిపై తప్పక తిరుగుబాటు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
అలాంటి సినిమాలను అడ్డుకుంటాం..
సినిమాల కలెక్షన్ల కోసమే రాయలసీమను రక్త చరిత్రగా చూపుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమలో విద్యావంతమైన యువత ఉందన్నారు. చరిత్రను వక్రీకరించి సీమలో ఫ్యాక్షన్, ఘర్షణ పెంచే సినిమాలు తీస్తే యూనివర్సిటీ విద్యార్థులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెర్నెకల్ రవి, హరినాయుడు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : తెలంగాణ : మట్టపల్లి శివాలయంలోనికి పులిచింతల బ్యాక్ వాటర్