కర్నూలుకు హైకోర్టును తరలించాలని గతంలో న్యాయవాదులు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా జగన్ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తానని శాసనసభలో ప్రకటించారు. అందులో భాగంగా...కర్నూలును న్యాయరాజధాని చేస్తానని హామీ ఇచ్చారు. తన హామీని నిలబెట్టుకునేలా..పలు కార్యాలయాలు కర్నూలుకు తరలివస్తున్నాయి. ఆగస్టు 28న కర్నూలు నగరంలోని స్టేట్‌గెస్ట్ హౌస్‌లో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటైంది. లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి రూం నంబర్-3లో కార్యాలయాన్ని ప్రారంభించారు. కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ఏర్పాటు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కర్నూలుకు లోకాయుక్త వచ్చిన నాలుగు రోజుల వ్యవధిలోనే...మానవ హక్కుల కమిషన్ కార్యాలయం నగరానికి వచ్చింది. స్టేట్ గెస్ట్ హౌస్‌లోనే..మరో గదిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 1న హెచ్ఆర్సీ ఛైర్మెన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి కార్యాలయాన్ని ప్రారంభించారు. జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కర్నూలుకు లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు తరలిరావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాం. 1993 నుంచి కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించాలని అనేక పోరాటాలు, త్యాగాలు చేశాం. కానీ గత పాలకులు రాయలసీమపై నిర్లక్ష్యం వహించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో తమ పోరాటాలు, త్యాగాలు ఫలించాయి. కర్నూలుకు దాదాపు 40 వరకు ట్రిబ్యునల్స్ రావాల్సి ఉంది. ట్రిబ్యునల్స్‌తో పాటు హైకోర్టు కూడా త్వరలోనే కర్నూలుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. -సుబ్బయ్య, కర్నూలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్
కర్నూలులో ఈ రెండు కార్యాలయాలతో పాటు ముఖ్యమంత్రి నిర్ణయానికి అనుగుణంగా ఇతర కమిషన్లు, ట్రిబ్యునల్ కార్యాలయాలు హైకోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయం. నగరానికి సీబీఐ కోర్టు కూడా రావాల్సి ఉంది. వాటితో పాటు 40 వరకు ట్రిబ్యునల్స్ కర్నూలు నగరానికి రావాల్సి ఉంది. త్వరలోనే అవి నగరానికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. న్యాయరాజధాని కోసం అనేక సంవత్సరాలుగా న్యాయవాదులంతా కలిసి పోరాటాలు చేసాం. మా ఆకాంక్షలకు అనుగుణంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. హైకోర్టును కూడా త్వరలోనే నగరానికి తరలించే పక్రియ చేపట్టాలని కోరుతున్నాం. - గఫూర్, న్యాయవాది
ఇదీ చదవండి