Schools Merge protest: పాఠశాలల విలీనంపై నిరసనలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా రావులపాలెంలోని ప్రాథమిక పాఠశాలను.. జడ్పీ బాలికోన్నత పాఠశాలలో విలీనం చేయడంపై పిల్లలు, తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. తమ పాఠశాల తమకే కావాలంటూ నినాదాలు చేశారు. రోడ్డుని దిగ్బంధించడంతో కాసేపు రాకపోకలు నిలిచాయి. అంబాజీపేట మండలం ఇసుకపూడి, పుల్లేటికుర్రులోనూ బడుల విలీనంపై ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అన్ని వసతులున్న అయినాలవారిపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులను.. ఇసుకపూడి ఉన్నత పాఠశాలకు పంపడమేంటంటూ ప్రశ్నించారు. అమలాపురం - రాజమహేంద్రవరం ప్రధాన రోడ్డు దాటే సమయంలో పిల్లలకు రక్షణ ఎలా అని నిలదీశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఎంపీపీ ఆదర్శ పాఠశాల ఎదుట పిల్లలు, తల్లిదండ్రులతో మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి ఆందోళన నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆర్లిలో.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను.. సుదూరంలో ఉన్న మాకవరం ఉన్నత పాఠశాలకు తరలించవద్దని నిరసన తెలిపారు. బడిలో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ దూరంగా ఉన్న మాకవరం పాఠశాలకు తరలించడం వల్ల పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వేముగోడులోనూ.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో వసతులు లేవని గుర్తుచేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లిలో.. పాఠశాల విలీనం ఆపాలని నిరసన చేపట్టారు. మా పాఠశాల మాకు కావాలంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: