కడప జిల్లాలో పోలీస్ శాఖ వైకాపా కనుసన్నల్లో నడుస్తోందని తితిదే మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆరోపించారు. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదుకూరు మండల పరిధిలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఘర్షణ కేసులో తెదేపా కార్యకర్త లేకపోయినప్పటికీ అతనిని ముద్దాయిగా చేర్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తొలుత బైండోవర్ కేసు పెట్టిన పోలీసులు వైకాపా నాయకులు చెప్పడంతో హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమన్నారు. మైదుకూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా మొత్తం పోలీసులు వైకాపా నాయకులు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని కోరారు. సీఎం జగన్.. రైతుల మెడలకు ఉరితాడు బిగిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ మీటర్ల విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకే కొత్త విద్యావిధానం'