Rejection of dotted lands నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూముల తొలగింపులో బాధితులకు న్యాయం జరుగుతుందా? వారి పేర్లతో మరొకరు లబ్ధి పొందుతున్నారా? అన్నదానిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనిపై గట్టి నిఘా అవసరమని జిల్లా అధికారులకు రెవెన్యూశాఖ సూచించింది. జిల్లా సంయుక్త కలెక్టర్లతో భూ పరిపాలనశాఖ ఇటీవల నిర్వహించిన సమావేశం సందర్భంగా నిషిద్ధ జాబితా నుంచి చుక్కల భూముల తొలగింపు, మ్యుటేషన్ల దరఖాస్తుల పురోగతిపై సమీక్ష జరిగింది. గతంలో కలెక్టర్ల సిఫార్సుల మేరకు భూ పరిపాలనశాఖ అనుకూల ఉత్తర్వులిచ్చేది. ఇందుకు ఎక్కువ సమయం పడుతుందని.. కలెక్టర్ల స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవచ్చని కొద్దికాలం క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లోని చుక్కల భూములను నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తూ ఎక్కువ సంఖ్యలో ఉత్తర్వులొస్తున్నాయి. మిగిలిన జిల్లాలో దరఖాస్తుల తిరస్కృతి ఎక్కువగా ఉంటోంది. ఇది చర్చనీయాంశంగా మారుతోంది. పేదలు, పలుకుబడి లేనివారి నుంచి తక్కువ ధరలకు చుక్కల భూములను తీసుకుని.. వాటిని నిషిద్ధ జాబితా నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
ఇంతలా తిరస్కృతి ఎందుకు?
తగిన ఆధారాలు చూపిస్తే వీటిపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం పలు సందర్భాల్లో మార్గదర్శకాలు జారీచేసింది. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నా.. దరఖాస్తులు తిరస్కృతికి గురవుతున్నాయి. ఇలాంటి దరఖాస్తులు సుమారు లక్ష వరకు వచ్చాయి. వీటిలో 23వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందులో 3,300 దరఖాస్తులను అనుమతించి 19వేల దరఖాస్తులను తిరస్కరించారు. మిగిలినవి పరిశీలనలో ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఏలూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో దరఖాస్తులను తిరస్కరించారు. నిర్దేశిత గడువు దాటి పరిష్కారం కాని దరఖాస్తులు అనకాపల్లి, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట, చినగంజాం, ఇతరచోట్ల వందల ఎకరాల చుక్కల భూములు నిషిద్ధ జాబితా నుంచి బయటపడ్డాయి. ఆంగ్లేయుల హయాంలో ఆర్‌ఎస్‌ఆర్ (రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్) తయారీలో వివరాల నమోదులో జరిగిన తప్పిదాలకు అమాయకులు బలవుతున్నారు. సర్వే సమయంలో యజమానులు లేరన్న కారణంతో చుక్కలు పెట్టి, వారిని రోడ్డున పడేశారు.
ఇవీ చదవండి: