ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని... మంత్రి ఆదిమూలపు సురేశ్ సూచించారు. కడప కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన... పాఠశాలలు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్చాలనే ముఖ్యమంత్రి జగన్ సూచనను అందరూ పాటించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన అవినీతిరహిత పాలన సాగుతోందనే విషయాన్ని అధికారులంతా గుర్తుంచుకోవాలన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు తగిన మౌలిక వసతులు కల్పిస్తూనే... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు.
రాష్ట్రంలోని 46 వేల పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమం కింద మెరుగు పర్చేందుకు... తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో పనులు చేపడతామని మంత్రి సురేశ్ పేర్కొన్నారు. మొదటి విడతలో 15వేల పాఠశాలల రూపురేఖలు మార్చి నాటికి మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారని... ఈ కార్యక్రమాన్ని నవంబరు 14న సీఎం ప్రారంభిస్తారని వివరించారు. అమ్మఒడి పథకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే విడుదల చేస్తామన్న విద్యాశాఖ మంత్రి... ప్రతినెల మొదటి, మూడో శనివారాలు ''నో బ్యాగ్ డే'' అమలు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి... అక్కడి ట్రిపుల్ ఐటీని సందర్శించారు.
ఇదీ చదవండీ... 'కుమార్తె మాట వినలేదని... గొంతు కోసుకున్న తండ్రి'