కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో.. భారత క్రీడా ప్రాధికార సంస్థ "ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" కింద దేశంలోని పలు క్రీడా పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తుంది. మూడేళ్ల పాటు క్రీడలకు కావాల్సిన నిధులు, కోచ్‌లను నియమించడం, మౌలిక వసతులు కల్పించడం వంటి సౌకర్యాలను భారత క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా 2020-21 సంవత్సరానికి కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ దేశంలోని 10 ప్రాంతాలను ఎంపిక చేసింది. వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కడప వైయస్సార్ క్రీడా పాఠశాల ఎంపికయ్యింది.
ఏటా రూ. 3 కోట్లు
ఖేలో ఇండియా ప్రాజెక్టుకు కడప క్రీడా పాఠశాల ఎంపిక అయినందున... ఏటా రూ. 3 కోట్ల రూపాయల నిధులను భారత క్రీడా ప్రాధికార సంస్థ విడుదల చేస్తుంది. ఈ విధంగా మూడేళ్ల పాటు నిధులు వెచ్చించి జాతీయ స్థాయిలో క్రీడలను ఇక్కడ అభివృద్ధి చేయడానికి కావాల్సిన సౌకర్యాలను కల్పిస్తుంది. ఖేలో ఇండియా ఎంపిక చేసిన పాఠశాలలో ప్రధానంగా 3 క్రీడలపై దృష్టి సారించి అభివృద్ధి చేస్తారు. బాక్సింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిప్టింగ్ క్రీడలను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనను భారత క్రీడా ప్రాధికార సంస్థ ముందు పెడతామని కడప క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బాషా మోహిద్దీన్ తెలిపారు.
నిష్ణాతులైన కోచ్‌లతో శిక్షణ
కడప వైయస్సార్ క్రీడా పాఠశాలలో 250 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ చదువుతో పాటు క్రీడలపై శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ అథ్లెటిక్స్, ఫుట్ బాల్, స్విమ్మింగ్, వాలీబాల్, హాకీ, వెయిట్ లిప్టింగ్, ఆర్చరీ, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, తైక్వాండో క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. ఖేలో ఇండియా ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో తర్ఫీదుపొందే అవకాశం కలగనుంది.
కడప వైయస్సార్ క్రీడా పాఠశాల ఖేలో ఇండియా ప్రాజెక్టుకు ఎంపిక అయినందున.. త్వరలోనే భారత క్రీడా ప్రాధికార సంస్థ ప్రతినిధులు ఇక్కడకు వచ్చి పరిశీలన చేయనున్నారు.
ఇవీ చదవండి..