కడప జిల్లాలోని గండికోట జలాశయ ముంపు గ్రామాల్లోనూ.., పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట పంచాయతీలోనూ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయలేదు. కడప జిల్లా కొండాపురం మండలంలోని ఓబన్నపేట, సుగుమంచిపల్లె-1, సుగుమంచిపల్లె-2 ఎంపీటీసీ స్థానాలకు, సుగుమంచిపల్లె సర్పంచి, 14 వార్డు సభ్యుల స్థానాలకు అధికారులు ఎన్నికల ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో నామపత్రాలు దాఖలు గడువు ముగిసినా ఒక్క నామినేషన్ కూడా రాలేదని మండల ఎన్నికల అధికారి నేతాజీ తెలిపారు. గతంలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారని, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీలను విలీనం చేశారని ముంపు ప్రాంతాల వాసులు చెబుతున్నారు. అధికారుల చర్యలను నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికల్లో పాల్గొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు.
గ్రామాన్ని ‘ఏజెన్సీ’ నుంచి తొలగించాలి
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆ గ్రామస్థులు ప్రకటించారు. నామపత్రాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వినతి పత్రం అందజేశారు. గిరిజనులు అంతగా లేని గ్రామాన్ని ఏజెన్సీ పంచాయతీగా ప్రకటించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇప్పటికైనా జనాభా ప్రాతిపదికన పంచాయతీని ప్రకటించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :
FIRE ACCIDENT: సైకిల్ దుకాణంలో అగ్ని ప్రమాదం..రూ. 15 లక్షల ఆస్తి నష్టం!