YS Viveka Murder Case Updates: మాజీ మంత్రి వివేకా హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు బయటికి వచ్చాయి. పులివెందుల కోర్టులో ఇవాళ నలుగురు నిందితులకు సంబంధించి అభియోగ పత్రాలు, ఫిర్యాదులను కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సంబంధిత న్యాయవాదులకు అందజేశారు. అందులో భాగంగా దస్తగిరి సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు బయటకు రావడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
గతేడాది ఆగస్టు 31న ప్రొద్దుటూరు కోర్టులో సెక్షన్ 164 కింద దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత.. సీబీఐకి ఎలాంటి వివరాలు తెలియజేకుండా, మభ్య పెట్టేవిధంగా, అతన్ని లొంగదీసుకునేందుకు వైకాపాకు చెందిన కొందరు అతన్ని సంప్రదించినట్టు దస్తగిరి ఫిర్యాదు రూపంలో సెప్టెంబరు 30న సీబీఐకి అందజేశాడు. అందులో ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న పులివెందులకు చెందిన భరత్ యాదవ్ తరచూ తన ఇంటికి వచ్చే వాడని, సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావు, ఏం స్టేట్‌మెంట్ ఇచ్చావు.. ఆ వివరాలన్నీ అవినాష్‌రెడ్డికి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తెలియజేయాలని వేధిస్తున్నాడని సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో దస్తగిరి తెలిపాడు. తాను.. సీబీఐ నిఘాలో ఉన్నానని, ఎక్కడికీ రాలేనని దస్తగిరి చెప్పినట్టు వివరాల్లో నమోదై ఉంది.
'దస్తగిరి ఇంటి వెనుక ఉన్న పులివెందుల భాక్రాపురంలోని హెలిపాడ్ వద్దకు రమ్మని చెప్పడంతో దస్తగిరి అక్కడికి వెళ్లాడు. భరత్ యాదవ్, న్యాయవాది అక్కడికి వచ్చి ఈ విషయాలు ఎక్కడా చెప్ప వద్దు నీకు 10 లేదా.. 20 ఎకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చేందుకు ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన విషయాలు సీబీఐకి చెప్పొద్దు. ఇప్పటివరకు సీబీఐకి ఎలాంటి వివరాలు చెప్పావో అవన్నీ మాకు తెలియజేయాలి’’ అని ఒత్తిడి చేసినట్టు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత మరోసారి కూడా భరత్ యాదవ్ తన ఇంటికి వచ్చి అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలి, అన్న పిలుస్తున్నాడని చెప్పినట్టు సమాచారముంది. పులివెందులలో తాను ఎక్కడెక్కడ తిరుగుతున్నది, ఎవరిని కలుస్తున్నది భరత్ యాదవ్ నిఘా పెట్టి ఫాలో అవుతున్నాడు' అని తన ఫిర్యాదులో దస్తగిరి పేర్కొన్నాడు.తాజాగా ఈ వివరాలు బయటకు రావడం సంచలనంగా మారింది.
వాంగ్మూలం నమోదు...
మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి.. సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసులో (ఏ-4) నిందితుడిగా ఉన్న డ్రైవర్ దస్తగిరిని.. సీబీఐ అధికారులు సోమవారం.. కడప జిల్లా పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అప్రూవర్‌గా మారిన అతని చేత.. మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం నమోదు చేయించారు. గతేడాది నవంబరు 26న అప్రూవర్‌గా మారేందుకు.. దస్తగిరికి కడప కోర్టు అనుమతివ్వగా.. ఆగస్టు 31న మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు.
వివేకా హత్య కేసు బదిలీ..
YS Viveka Murder Case transfer: మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.
నిందితుల రిమాండ్ పొడిగింపు..
అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
కేసులో మరో ట్విస్.. సీబీఐ అధికారిపై కేసు
case on cbi officer: వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కేసు నమోదైంది. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారని కడప కోర్టులో ఉదయ్ కుమార్ పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఏముందంటే..
సీబీఐ తనని వేధిస్తుందంటూ కేసులో అనుమానితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 15వే తదీన కడప అదనపు ఎస్పీని కలిశారు. ఈ మేరకు సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పినా పట్టించుకోవట్లేదని.. వాళ్లు చెప్పినట్లు వినాలని వేధిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనని మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రస్తావించారు.
ఇదీ చదవండి: నువ్వు లంచం అడిగావ్.. నేనా...గుండెపై చేయి వేసి చెప్పు... ఏకంగా ఒట్టేసుకున్నారు!