అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ. 18,000 ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ కడప జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
విశాఖలో....
విశాఖలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణను... స్వచ్ఛంద సంస్థలకు అప్పగింత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ వంటివి వర్తింపజేసి పింఛన్ సదుపాయం కల్పించాలని కోరారు.
ప్రకాశం....
అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి సరైన నిధులు కేటాయించాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి పథకం అంగన్ వాడీ కేంద్రాలకు వర్తింప చేయాలని కోరారు.
కర్నూలు...
అంగన్‌వాడీ వర్కర్లపై అధికార పార్టీ నాయకుల వేధింపులు అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అంగన్‌వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.