కడప జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అవసరమైన మేరకు లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులోకి రావడం లేదు. బళ్లారి నుంచి రోజుకు 17.5 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ జిల్లాకు సరఫరా అవుతోంది. డిమాండ్ మాత్రం రెట్టింపు స్థాయిలోనే ఉంది. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి మెడికల్ ఆక్సిజన్ తీసుకోవాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కడప శివారులోని పారిశ్రామికవాడలో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. గతేడాది అక్టోబరులో లైఫ్‌లైన్ ఇండస్ట్రీస్‌లో "ఎయిర్ సపరేషన్ ప్లాంట్" ప్రారంభమైంది. ఈ పరిశ్రమలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. గాలి ద్వారా స్వచ్ఛమైన మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తున్నారు. రోజుకు 5 కిలో లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోంది. గత మార్చి వరకు ఎలాంటి డిమాండ్ లేని ఈ పరిశ్రమకు... కొవిడ్ కారణంగా డిమాండ్ బాగా పెరిగింది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సిజన్‌ను జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రులకు సరఫరా చేసే విధంగా ఆదేశాలిచ్చారు. అందుకనుగుణంగా 24 గంటల పాటు ప్లాంట్ నడిపిస్తూ... రోజుకు 5 కిలో లీటర్ల మెడికల్ ఆక్సిజన్ తయారు చేస్తున్నారు. గాలిలో 21 శాతం ఆక్సిజన్, 78 శాతం నైట్రోజన్ ఉంటుంది. గాలిలో ఉన్న 21 శాతం ఆక్సిజన్ వేరుచేసి... దానిద్వారా స్వచ్ఛమైన మెడికల్ ఆక్సిజన్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. మైనస్ 180 డిగ్రీల వద్ద మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్లాంట్‌లో 7 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కల్గిన 550 సిలిండర్లు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన మెడికల్ ఆక్సిజన్‌ను సిలిండర్లలో నింపి ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫాతిమా కొవిడ్ ఆసుపత్రికి రోజుకు 120 సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కలెక్టర్ సూచించిన వాటికి అవసరాన్ని బట్టి సరఫరా చేస్తున్నారు. గత మార్చి వరకు నెలకు 2 వేల సిలిండర్ల ఆక్సిజన్ విక్రయించడమే గగనమైంది. కానీ మే నెల నుంచి రోజుకు 500 నుంచి 600 సిలిండర్లను విక్రయిస్తున్నట్లు ప్లాంట్ ఎండీ డాక్టర్ రెడ్డిప్రసాద్ తెలిపారు. గత నెలలో రోజుకు 3 కిలో లీటర్ల మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుండగా... ఈనెల 7 నుంచి 5 కిలో లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నారు. గాలి ద్వారా మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్ జిల్లాలో ఇదొక్కటే ఉండటం విశేషం. 7 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న సిలిండర్‌లో ఆక్సిజన్ నింపితే 400 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ బాధితుల అవసరాల మేరకే ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నామని యాజమాన్యం చెబుతోంది.
కడప శివారులోనే ఆక్సిజన్ ప్లాంట్ ఉండటంతో కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్సులు కూడా ఈ ప్లాంట్ వద్దకు వచ్చి ఆక్సిజన్ నింపుకుని వెళ్తున్నాయి. హోం ఐసోలేషన్‌లో ఉండి ఆక్సిజన్ అవసరమైన బాధితుల కోసం కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి సిలిండర్లలో ఆక్సిజన్ నింపి ఇస్తున్నామని నిర్వాహకులు వివరిస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు రోజుకు 60 మంది వరకు వస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండీ... గనుల శాఖ: కీలక నిర్ణయాలకు సీఎం జగన్ ఆమోదం