స్థానిక ఎన్నికల్లో వైకాపాకు దక్కిన ఈ విజయం చారిత్రాత్మకమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ అన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైకాపా కైవసం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ బలోపేతానికి కారణమయ్యాయన్నారు. రాజధాని అంశాన్ని తెదేపా నేతలు తెరపైకి తీసుకువచ్చి ప్రచారం చేసినా.. దాని ప్రభావం ఎక్కడా కనిపించలేదని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగినా.. సగం సీట్లు సైతం సాధించలేక పోయారని విమర్శించారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ తాము ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
వేడుకల మోత...
వైకాపా ఘన విజయం సాధించడంతో.. గుంటూరులో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కార్యాలయం వద్ద టపాసులు పేల్చారు. ప్రభుత్వం రెండేళ్ల పాలనకు ప్రజలు ఆకర్షితులై పట్టం కట్టారన్నారని స్పష్టం చేశారు. తెదేపా నేతలు ఎన్ని దుష్ట ప్రచారాలు చేసినా.. జనం వాటిని తిప్పి కొట్టారన్నారు. నేటి ప్రజాతీర్పుతోనైనా ప్రతిపక్ష పార్టీ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎవరెన్ని మాయమాటలు చెప్పినా.. ప్రజలు ఎప్పుడూ వైకాపాకే అండగానే ఉంటారని పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య పేర్కొన్నారు.
సమస్యలపై ప్రత్యేక దృష్టి...
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా కార్యాలయం వద్ద బాణసంచా పేల్చి.. వైకాపా నేతలు వేడుకలు జరిపారు. నగరంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యక దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. యూజీడీ పనులు, రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: