పట్టణ ప్రజలకు మెరుగైన వైద్యచికిత్సలు అందించాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం పట్టణ ఆరోగ్యకేంద్రాలు ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాల్లోని మురికివాడల్లో నివశించే ప్రజలకు దగ్గర్లోనే వైద్యసదుపాయాలు కల్పించడం, చిన్న చిన్న రోగాలు, వ్యాధులకు పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే చికిత్సలు అందించడం వీటి లక్ష్యం. అప్పటి ప్రభుత్వం వీటి నిర్వహణను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం.. పీపీపీ విధానంలో నిర్వహించేలా ఓ ఫార్మసీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా 230 వరకు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్వహిస్తుండగా.. గుంటూరు జిల్లాలో 32 కేంద్రాలు నడుస్తున్నాయి. సదరు సంస్థ ఏర్పాటుచేసిన వైద్యులు, సిబ్బందితోనే సేవలు నడుస్తున్నాయి. సాధారణ రోగాలకు ఎంబీబీఎస్ వైద్యునితో సేవలు అందిస్తుండగా.. జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఎండోక్రైనాలజీ, ఆర్థోపెడిక్స్ వంటి స్పెషాలిటీ వైద్యసేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా అందిస్తున్నారు. టెలీ కన్షల్టేషన్ వైపు రోగులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వీటికోసం ఒక్కోసారి గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి. ఇక్కడ వైద్యసేవలు పరిమితిగా ఉండటం.. ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లపై సరైన దృష్టి పెట్టకపోవడంతో రోగుల సంఖ్య పరిమితంగా మారింది. సగటున రోజుకి 40 నుంచి 45 మంది.. నెలకు 1300 నుంచి 1400 వందలకు మించి పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రావడం లేదు. కనీసం సెలైన్ బ్యాటిల్ పెట్టాలన్నా పడకలు లేవు. లేబర్ వార్డు, గైనకాలజీ వంటి సేవలు లేకపోవడంతో మహిళలు.. సమీపంలోనే ఉన్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు రావడం మానుకున్నారు. కొన్నిచోట్ల రక్తం, యూరిన్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. రసాయనాలు లేక కొన్నిచోట్ల ల్యాబ్ పరీక్షలు నిర్వహించడం లేదు. పిల్లలు, కరోనా వ్యాక్సిన్లకు వచ్చేవారు లేకపోతే పట్టణ ఆరోగ్యకేంద్రాలు మరింత బోసిపోయేవి.
నాలుగేళ్ల ఒప్పందం ముగియనుండటంతో వీటిని నిర్వహించే సంస్థ.. పట్టణ ఆరోగ్య కేంద్రాలపై సీరియస్గా దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వచ్చే ఏప్రిల్ 1 నుంచి పట్టణ ఆరోగ్యకేంద్రాలు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్పారు. గుంటూరులో అదనంగా 50 కేంద్రాలు రానున్నాయని డీఎంహెచ్వో యాస్మిన్ చెప్పారు..
నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన తరుణంలో పట్టణ ఆరోగ్యకేంద్రాలను బలోపేతం చేయాల్సిన అవసరముంది. పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో సేవలను విస్తృతం చేస్తే పెద్దాస్పత్రులు, బోధనాస్పత్రుల సేవలపై ఒత్తిడి తగ్గి.. మరింతమందికి సేవలు అందే అవకాశముంది.
ఇవీ చదవండి