ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన చలో తాడేపల్లి కార్యక్రమానికి అనుమతి లేదని, ఇప్పటికే అక్కడ144వ సెక్షన్ అమల్లో ఉందని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని.. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిలోని వ్యక్తుల పనులకు అంతరాయం కలిగించడం నేరమని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. హైకోర్టు, రాజభవన్, సచివాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాలు ముట్టడించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
చలో తాడేపల్లి కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా నిరుద్యోగ యువతను పోలీసులు బెదిరించటం తగదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని గుంటూరు ఎస్పీ హెచ్చరించటం అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని నిలదీశారు. శాశ్వతంగా సీఎం నివాసం వద్ద 144 సెక్షన్ పెట్టడమే తప్పైతే, అసలు అక్కడ నిరసన తెలిపే హక్కే ప్రజలకు లేదంటూ మరో పెద్ద తప్పు పోలీసులు చేస్తున్నారని లోకేశ్ విమర్శించారు.
రాష్ట్రం నలుమూలల నుంచి చలో తాడేపల్లి కార్యక్రమానికి బయలుదేరిన వివిధ విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధుల్ని పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వాహనంలో బయలుదేరిన టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని పట్టణ పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. కొత్త జాబ్ క్యాలెండర్ కోసం ముట్టడి కార్యక్రమానికి వస్తున్న తిరుపతి నిరుద్యోగ యువతను పోలీసులు అరెస్ట్ చేయడాన్నితిరుపతి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు తప్పుపట్టారు.
ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్...అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హలో నిరుద్యోగి చలో తాడేపల్లి కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాలు, తెదేపా నాయకులను అనంతపురం జిల్లా హిందూపురంలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి నాయుకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు