రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూలు, ఉన్నత ప్రమాణాలు పాటించేందుకు వీలుగా పాఠశాల, ఉన్నత విద్యకు ప్రభుత్వం వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు ఛైర్మన్‌గా, జాతీయస్థాయిలో పేరొందిన నిపుణుడు వైస్ ఛైర్మన్‌గా ఉంటారు. ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా ఉంటారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారు. కమిషన్‌కు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. బోధన పద్ధతులు, పాఠ్యాంశాలు, కోర్సులు, స్కూళ్ల నిర్వహణ, సదుపాయాల కల్పన, పరీక్షల విధానం ఇలా అన్నింటిలోనూ విద్యా రంగంలో వస్తున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పులు రావాల్సి ఉంది. ఈ ఉద్దేశంతోనే విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక నియంత్రణ కమిషన్ అవసరమని ప్రభుత్వం భావించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా
విద్యాసంస్థల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం, ఫీజుల నియంత్రణ, స్కూళ్ల పర్యవేక్షణ మరింత సమర్థంగా ఉండేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లన్నీ ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. ప్రైవేటు స్కూళ్లలోని ఫీజుల నియంత్రణ అధికారం కూడా కమిషన్‌కు ఉంటుంది. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా సంస్థల్లో 25శాతం సీట్లు పేద వర్గాలకు అందేలా చూస్తుంది. ఆయా స్కూళ్ల ఫీజుల నిర్ణయానికి అక్రిడిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తుంది. ఆయా సంస్థలకు జరిమానా విధించడం, నిబంధనలు పాటించని సంస్థల గుర్తింపు రద్దు చేసే అధికారాలు ఉంటాయి. ఆయా అంశాలపై ఎవరినైనా పిలిచి విచారించే అధికారం ఉంటుంది. కమిషన్ ఆదేశాలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.