రంగురంగుల పూల సోయగాలు... వివిధ రకాల కూరగాయలు.. రుచికరమైన పండ్లు... ప్రకృతిమాత ఒడి నుంచి జాలువారిన మొక్కలతో తమ ఇళ్లను పొదరిల్లులా మార్చేశారు గుంటూరు నగరంలోని కొందరు పర్యావరణ ప్రేమికులు. సహజంగా నగరాల్లో మొక్కలు పెంచటానికి అవసరమైన స్థలం ఉండదు. అయితే మనసు పెడితే మార్గం ఉంటుందని నిరూపించారు కొందరు. తమ ఇంటి పై కప్పుని సాగు ప్రయోగశాలగా మార్చుకున్నారు.
కొత్త ఒరవడి..
మిద్దెసాగు పేరిట ఇటీవలి కాలంలో వచ్చిన నూతన ఒరవడిని అందిపుచ్చుకుని ఆరోగ్యకరమైన జీవనానికి బాటలు వేసుకుంటున్నారు. ఇంటి పై కప్పుపై కుండీల్లోనే టమోటా, వంగ, బెండ, దొండ, కాకర, బీర తదితర కూరగాయలతో పాటు... జామ, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబీ, మందారం, నందివర్దనం, గరుడ వర్థనం, మందారం, మంకెన, బంతి, చేమంతి వంటి పూల మొక్కలను పెంచుతున్నారు.
వందకుపైగా కుటుంబాలు...
మిద్దెసాగు చేపట్టే క్రమంలో తమ ఇంట్లో పాడైపోయిన వస్తువులెన్నో కుండీలుగా మారిపోయాయి. ఇంట్లో పోగయ్యే చెత్తా చెదారానికి, కొబ్బరిపీచు తోడు చేసి సేంద్రీయ ఎరువుగా మార్చి మొక్కలకు వేస్తున్నారు. ఆ మొక్కలు, వాటికి వచ్చే పూలు, కూరగాయలు.. ఆయా కుటుంబాలకి ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం పంచుతున్నాయి. ప్రతిరోజూ 2నుంచి 3గంటలు మొక్కల పెంపకంలోనే ప్రకృతి ప్రేమికులు గడుపుతున్నారు. వీటితో తమకు కాలక్షేపంతో పాటు మంచి ఆరోగ్యమూ సమకూరిందని అంటున్నారు. నగరపాలక సంస్థ కూడా ఇలాంటి వారికి కొన్ని రకాల మొక్కలు ఉచితంగా అందజేస్తోంది. గుంటూరు నగరంలో వందకు పైగా కుటుంబాలు మిద్దెతోటలను పెంచుతున్నారు. మొక్కల పట్ల తమ ప్రేమను చాటుకోవటంతో పాటు పర్యావరణానికి మేలు చేస్తున్నారు.
ఇదీ చదవండి