గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన నిరభ్యంతర పత్రాలతో ఏపీలోకి వచ్చేందుకు యత్నించిన యువకులను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్ఓసీలు ఇచ్చినా.. అవి చెల్లవని తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. దీని వల్ల రెండు వేల మందికి పైగా రోడ్లపై నిలిచిపోయారు. సాయంత్రం వరకూ వేచి చూసిన విద్యార్థులు వెనక్కి వెళ్లి.. సాయంత్రం 6 గంటల సమయంలో మళ్లీ సరిహద్దుల వద్దకు వచ్చారు. వీరు పొందుగుల మీదుగా సొంతూళ్లకు వెళ్లాలని భావించారు.
బలగాల మోహరింపు
విషయం తెలుసుకున్న పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు. కృష్ణా నది బ్రిడ్జిపై ఇనుప కంచెలు వేసి రాకపోకలను పూర్తిగా నియంత్రించారు. ఒకవేళ ఎవరైనా ఏపీలోకి రావాలంటే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అక్కడే వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. గుంటూరు అదనపు ఎస్పీ సరిహద్దు వద్ద పరిస్థితిని సమీక్షించారు.
విద్యార్థుల ఆగ్రహం
పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వేచి చూస్తున్నా.. వైద్య పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేవలం వైద్య పరీక్షలు జరిపి వ్యాధి లక్షణాలు లేకపోతే తమ ఇళ్లకు వెళ్లేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కొందరు సరిహద్దు దాటేందుకు యత్నించడం వల్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పోలీసుల లాఠీఛార్జి
తమను అడ్డుకున్న పోలీసులపై.. విద్యార్థులు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులతో పాటు.. కొందరు విద్యార్థులకు గాయాలయ్యాయి. బాధితులకు అక్కడే ప్రథమ చికిత్స అందించారు. కొద్ది సేపట్లోనే పరిస్థితి అదుపులోకి రాగా.. లాఠీఛార్జీ అనంతరం చాలా మంది యువకులు పరారయ్యారు. ఈ ఘర్షణలో కొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆ వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ఆధారంగా కేసులు నమోదు చేస్తామని గుంటూరు అదనపు ఎస్పీ చక్రవర్తి తెలిపారు.
వైద్య పరీక్షలకు అంగీకరించిన వారికి అనుమతి
మరోవైపు వైద్య పరీక్షలకు అంగీకరించిన వారిని.. పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించారు. వైద్య పరీక్షల అనంతరం మాచర్ల, నర్సరావుపేటలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. గొడవ సద్దుమణిగిన తర్వాత కొందరు యువకులు అక్కడకు చేరుకుని.. తాము గొడవలో లేమని పోలీసులకు తెలిపారు. ద్విచక్ర వాహనాలు ఇస్తే హైదరాబాద్ వెళ్లి పోతామని చెప్పారు. వారి ఆధార్ కార్డు, ఇతర వివరాలు సేకరించిన పోలీసులు ద్విచక్ర వాహనాలు తీసుకెళ్లేందుకు అనుమతించారు.
ఇదీ చూడండి: