TTD Chairman BR Naidu on Tirumala Stampede Incident: తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, శనివారం వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తామని తెలిపారు. తొక్కిసలాట ఘటనపై తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియపై సమీక్షించారు. దర్శన విధానాలపైన కూడా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు : ఈ క్రమంలో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాడ్లాడారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. ఘటనపై ఇప్పటికే న్యాయవిచారణకు సీఎం ఆదేశించారని తెలిపారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని టీటీడీ ఛైర్మన్ అన్నారు. చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని అవి మా దృష్టికి వచ్చాయని, ఘటనకు సంబంధించి ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు.
తిరుపతి ఘటన - ఇద్దరు అధికారులు సస్పెన్షన్ - ఎస్పీ, జేఈవో బదిలీ
మరోసారి మీడియా ముందుకు: తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదని కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన బతికిరారు కదా అని అన్నారు. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తప్పిదం జరిగింది, అది ఎలా జరిగిందో విచారణ చేయిస్తామని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ముందు నిర్వహించిన ప్రెస్‌మీట్ అయిన తర్వాత బీఆర్ నాయుడు మరోసారి బోర్డు సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చి భక్తులకు క్షమాపణలు తెలిపారు.
టీటీడీ బోర్డు సభ్యుల వ్యక్తిగతంగా ఆర్థిక సాయం : తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం ప్రకటించారు. టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్ల చెరో రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించగా ఎం.ఎస్.రాజు రూ.3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడానికి ముందుకొచ్చారు.
తప్పు లేదంటే ఎలా? క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు: పవన్ కల్యాణ్