Arrangements for Boat Races in Atreyapuram Ambedkar Konaseema District: ఆంధ్రా కేరళగా కోనసీమ ప్రసిద్ధి చెందింది. ఆ రాష్ట్రం తరహా పడవ పోటీలను ఈ సంక్రాంతికి కోనసీమ ప్రాంతంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లొల్లలాకుల చెంత గోదావరి గలగలలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చని చేళ్ల నడుమ పంట కాలువల్లో పడవ పోటీలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పూత రేకులతో నోరూరించే ఆత్రేయపురం ప్రాంతం ఇందుకు వేదిక కానుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో పడవ, ఈత పోటీలు ఈ నెల 11, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరితో పాటు అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. డ్రాగన్ పడవలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు మహిళలకు రంగవల్లుల పోటీలు, చిన్నారులు, యువ తకు గాలిపటాలు (పతంగులు) పోటీలు నిర్వహించనున్నారు.
సుమారు పదివేల మంది వీటిని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీడాకారులు ఈ ప్రాంతానికి చేరుకుని పోటీలు జరుగు ప్రాంతంలో తర్ఫీదు పొందుతున్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు.
ఆత్రేయపురం నుంచి ఉచ్చిలి మధ్య ప్రధాన పంట కాలువలో సుమారు వెయ్యి మీటర్ల పరిధిలో పడవ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తుంది. పడవ పోటీలో మొదటి విజేతకు లక్ష రూపాయలు, ద్వితీయ విజేతకు 50 వేలు, తృతీయ విజేతకు 30 వేలు బహుమతిగా ఇవ్వనన్నారు.