బదిలీల కోసం ఉత్కంఠతో ఎదురుచూసిన ఉపాధ్యాయుల ఆశలపై.. విద్యాశాఖ నీళ్లు చల్లింది. పెద్దసంఖ్యలో ఖాళీలను ఈసారి బ్లాక్ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో బదిలీల సమయంలో డీఎస్సీ నియామకాల పోస్టుల వరకు మాత్రమే ఖాళీలు బ్లాక్ చేసేవారు. ఈసారి క్లియర్ వేకెన్సీల్లోనూ 50నుంచి 60శాతం బ్లాక్‌చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఉన్న ఖాళీలను పారదర్శకంగా చూపించకపోతే బదిలీల ప్రక్రియ ఎవరికోసమని కొన్ని ఉపాధ్యాయసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సిఫార్సుల కోసమే ఈ ఖాళీలను చూపించడం లేదంటూ ఆరోపిస్తున్నాయి. బస్సు సదుపాయం లేనిచోట్ల పనిచేసే నాలుగో కేటగిరీ ఉపాధ్యాయులకు తాజా బదిలీలపై తొలుత ఆశలు రేకెత్తాయి. 1,2 కేటగిరీల్లో గుంటూరు పరిసరాల్లో ఎక్కడో ఓ ప్రాంతాన్ని ఎంచుకోవాలని భావించారు. తీరా 1,2 కేటగిరీల్లోనూ ఖాళీ పోస్టులను సైతం చూపించకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. గుంటూరుతో పాటు రాష్ట్రంలో పలుచోట్ల ఇదే సమస్యపై ఉపాధ్యాయులు గళమెత్తారు. వెబ్ కౌన్సిలింగ్‌ను సైతం ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. ఒక్కో ఎస్జీటీ ఉపాధ్యాయుడు వెబ్ ఆప్షన్ నమోదు చేయాలంటే 2 వేల నుంచి 3 వేల వరకు ఆప్షన్లను పరిశీలించాలని.. ఇందుకు 8 నుంచి 9 గంటల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల ఆరోపణలను విద్యాశాఖాధికారులు..... కొట్టిపారేశారు. మారుమూల ప్రాంతాల్లో ఖాళీలు మిగిలిపోకూడదనే ఉద్దేశంతోనే కొన్ని ఖాళీలు బ్లాక్ చేసినట్లు వివరించారు. ఇందులో ఎలాంటి సిఫార్సులను తావులేదని... ఉపాధ్యాయులు అనవసరంగా కంగారుపడవద్దని అధికారులు కోరుతున్నారు.బదిలీలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ..పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: