మరణించిన తల్లిని రేషన్ కార్డు నుంచి తొలగించాలని కోరితే.. కుమార్తె మరణించినట్లు నమోదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. నగరంలోని ఆనంద్ పేటకు చెందిన షేక్ ఇస్మాయిల్ తల్లి హజరాబి.. ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. రేషన్ కార్డు ఆమె పేరిటే ఉంది. అందులో తల్లి పేరు తొలగించి తన భార్య పేరిట కొత్తకార్డు మంజూరు చేయాలని ఇస్మాయిల్ దరఖాస్తు చేసుకున్నాడు. హజరాబిని కార్డు నుంచి తీసివేసిన అధికారులు.. ఇస్మాయిల్ భార్య షేక్ బతుల పేరిట కొత్త కార్డు మంజూరు చేశారు. ఈ క్రమంలో హజరాబితో పాటు ఆమె మనవరాలు జైనాబ్ బీ మరణించినట్లు నమోదు చేసి.. ఆమె పేరునూ అధికారులు తొలగించారు.
ప్రస్తుతం జైనాబ్ బీ వివాహమై.. పెదకూరపాడులోని అత్తవారింట్లో ఉంటోంది. ఆమె భర్త అక్కడ కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరించారు. కారణం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తే.. జైనాబ్ బీ చనిపోయినట్లు ఆన్ లైన్లో చూపిస్తోందని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సచివాలయ సిబ్బందితో పాటు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఇస్మాయిల్ చెబుతున్నాడు. స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా.. ఆరు నెలలుగా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని చెప్పాడు. జైనాబ్ బీ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నా.. రేషన్ కార్డు కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయాడు.
ఇదీ చదవండి: