Prathipadu Hospital: "మా ఆస్పత్రికి 24 గంటల పాటు వైద్యులను కేటాయించండి. లేకపోతే ఆస్పత్రిని మూసేయండి" అంటూ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 2వ తేదీన గొట్టిపాడుకు చెందిన వ్యక్తి ఛాతిలో నొప్పితో ప్రత్తిపాడు ఆస్పత్రికి వెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ లేకపోవడంతో... డాక్టర్‌కు ఫోన్ చేసి ఆయన సలహా మేరకు స్టాఫ్ నర్స్ సూదిమందు వేసి ఇంటికి పంపించారు. ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో ఆ వ్యక్తి మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో జిల్లా క్లస్టర్ హాస్పటల్ సూపర్ డెంట్ రత్నాకర్ ప్రత్తిపాడు ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా.. బాధిత బంధువులు, స్థానిక ప్రజలు ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం రాత్రి పూట గర్భిణీ నొప్పులతో హాస్పిటల్‌కు రాగా.. డాక్టర్లు ఎవ్వరూ లేకపోవటంతో ఆయా ప్రసవం చేశారని బంధువులు మండిపడ్డారు. ఇలా ఎన్ని ప్రాణాలు తీస్తారంటూ అధికారి, సిబ్బందిని నిలదీశారు. జరిగిన ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపోరాటానికి సిద్ధమవుతామని మృతుని బంధువులు హెచ్చరించారు. వరుస ఉదాహరణలు చూపిస్తూ.. స్థానికులు, మృతుల బంధువులు ప్రశ్నల వర్షం కురిపించడంతో అధికారులు కంగుతిన్నారు.
ఓ అధికారి వారితో మాట్లాడుతూ... రాత్రిళ్లు కేవలం ఫోన్లో మాత్రమే మందుల సమాచారం ఇస్తారని.. అత్యవసరమైతే డాక్టర్ వస్తారని చెప్పడంపై.. అక్కడున్నవారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ వచ్చే వరకు రోగి బతికి ఉంటాడా? ప్రాణాల పోతే ఎవరిది బాధ్యత? అని ప్రశ్నించారు. దీంతో.. వారికి సమాధానం చెప్పలేక వచ్చిన అధికారి కారులో జారుకున్నారు.
ఇదీ చదవండి: TDP Leaders: గుడివాడలో అక్రమ మైనింగ్‌పై తెదేపా నేతల ఆగ్రహం