దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులతోనే కమిటీ వేయాలని ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ డిమాండ్ చేశారు. స్వామి నాథన్ కమిటీ సిఫార్సులు చేసి 14 ఏళ్లైనా.. ఇప్పటికీ ఏ ప్రభుత్వం అమలు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయం పెంచాలని డిమాండ్ చేశారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక చట్టాలు - ప్రజలపై ప్రభావం అనే అంశంపై చర్చించారు.
2019 నాటికి 3 లక్షల 30వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఐదేళ్లలో రెట్టింపు ఆదాయం ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఏమైందని సాయినాథ్ ప్రశ్నించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు దేశంలోని మిగతా రైతులు సంఘీభావంగా నిలవాలని కోరారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల వైపు కాకుండా.. రైతులవైపు మొగ్గుచూపాలని సాయినాధ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు సాగు చట్టాల విషయంలో కేంద్రాన్ని తప్పుబట్టారు.
సాగు చట్టాలను రద్దు చేయాలి: మధు
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని.. జగన్ ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయంలో తమిళనాడు రాష్ట్రం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. రైతులకు మద్ధతుగా సెప్టెంబర్ 25న దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వైకాపా నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నిరసనలో పాల్గొని రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: