Lokesh warning to YCP Government: విద్యుత్ ఛార్జీల పెంపుపై మే 10 తర్వాత బిల్లులు చూసి.. ప్రజల సహకారంతో భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పర్యటించిన లోకేశ్ కు మహిళలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. గంగానమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రావాలి కరెంట్ కావాలి కరెంట్ అంటూ దీపపుబుడ్డీలతో నిరసన తెలిపారు. మహిళలకు కొవ్వొత్తి, అగ్గిపెట్టి పంచిపెట్టారు. అనంతరం కరోనాతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబసభ్యులను పరామర్శించారు.
మే నెల విద్యుత్ బిల్లు వచ్చిన తర్వాత శాసనసభ్యులు, మంత్రులు అవసరమైతే ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడిస్తామని లోకేశ్ తెలిపారు. మంత్రి వర్గంలో సామాజిక న్యాయం ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. కావాలనే కొంత మందిని పక్కన పెట్టారని చెప్పారు. సలహాదారులు, సీఎంవో కార్యాలయమే పాలన చేస్తోందని ఆరోపించారు. జగన్ జపం కొట్టిన వాళ్లే మంత్రులయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల తరఫున అండగా నిలిచేవారికి ఎవ్వరికీ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ధరల పెంపుతో ప్రజలను పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ హాలిడే వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం వచ్చిందన్నారు. పరిశ్రమలు మూతపడటంతో నిరుద్యోగ సమస్య పెరుగుతోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : జగన్ 'బాదుడే బాదుడు'తో.. ప్రజలు అల్లాడుతున్నారు: చంద్రబాబు