Nadendla Manohar on Mirchi farmers: గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఆదివారం జనసేన పీఏసీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ పర్యటించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మిర్చి రైతులకు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సంతగుడిపాడులోని జాలది సుబ్బారావు, లింగంగుంట్లలోని మహిపతి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబాలకు రూ.5లక్షల చెక్కును అందజేశారు.
రైతులపై వైకాపా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. మాట తప్పారన్నారు. పల్నాడులో మిర్చి పంటను వేసిన రైతులు నష్టపోతే.. ఆదుకునే దిక్కులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిందని, అయినా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు.
ఇప్పటికైనా రైతులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి పండుగ తరువాత వారం రోజుల పాటు ప్రభుత్వానికి సమయమిస్తున్నామని, ఆ తర్వాత రైతుల తరపున తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తోపాటుగా రాష్ట్రంలోని జనసేన నాయకులంతా దీక్ష చేపట్టాల్సి వస్తుందని మనోహర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి సయ్యద్ జిలానీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం!