ఆచార్య నాగార్జున వర్శిటీ పరిధిలో డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో.. ప్రశ్నావళిపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు ప్రశ్నాపత్రంలో మొదటి సెమిస్టర్ ప్రశ్నలకు బదులు మూడో సెమిస్టర్ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. పాఠ్యాంశంలో లేని ప్రశ్నలు వచ్చాయని ఆరోపించారు. ఈ విషయాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్తే ఏదొకటి రాసేయండని తేలికగా చెప్పేశారు. దీనిపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విశ్వవిద్యాలయ అధికారులు దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 11న పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.
అసలు సిలబస్ పూర్తికాకుండా పరీక్షలు పెట్టొద్దని విద్యార్థులు గత వారం ధర్నా నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినట్లు..మొదటి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని.. లేకపోతే వాయిదా వేయాలని గత వారం విద్యార్థులు విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహించారు. అయినా అధికారులు పరీక్షలు నిర్వహించేందుకే మొగ్గు చూపారు. కొంత మంది అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వవిద్యాలయానికి లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలిసింది. మళ్లీ పరీక్ష పత్రాలు తయారు చేయడం, పరీక్షలు నిర్వహించడంతో ఆర్థిక భారం పడుతోందని కొంత మంది అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Covishield: రాష్ట్రానికి మరో 3.72 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు