గుంటూరు జిల్లా మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమను సొంతూళ్లకు పంపాలంటూ ఆందోళనకు దిగిన వలస కార్మికులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. ఎయిమ్స్‌లోని సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు.
ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 3 వేల మంది వలస కార్మికులు ఆందోళనకు దిగారు. దీర్ఘకాలంగా లాక్‌డౌన్ అమల్లో ఉండడం వల్ల తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను స్వరాష్ట్రాలకు పంపాలని వారు డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం అధికారులు వచ్చి హామీ ఇచ్చినా నెరవేర్చలేదని ఆరోపించారు. మిగిలిన రాష్ట్రాల నుంచి వలస కూలీలను తరలిస్తున్నప్పుడు తమను కూడా అలాగే తరలించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు అక్కడే ఉన్న సెక్యూరిటీ గదిని ధ్వంసం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న మంగళగిరి అడిషినల్ ఎస్పీ ఈశ్వర్‌రావు కూలీలతో మాట్లాడుతున్నారు. గుంటూరు జిల్లా ప్రస్తుతం రెడ్‌జోన్‌లో ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల వారు కూలీలను తీసుకెళ్లేందుకు సుముఖంగా లేరని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి : పాఠశాల విద్యార్థుల ఘర్షణ.. కర్రతో ఇద్దరిపై దాడి