గత కొద్ది రోజులుగా మంగళగిరి NRI ఆస్పత్రి పాలకమండలిలో నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆసుపత్రి క్వార్టర్స్‌లో ఉంటున్న కోశాధికారి అక్కినేని మణిపై తాజాగా దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ప్లాట్ వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని హుకుం జారీ చేసినట్లుగా మణి వెల్లడించారు. ప్లాట్‌లోని వస్తువులు కిందకు పడేసి.. తనను బలవంతంగా బయటకు గెంటేసి తాళాలు వేశారని తెలిపారు. ఈ ఘటనతో భయాందోళనకు గురై తొలుత 100కు ఫోన్ చేశానన్న ఆమె.. పోలీసులు ఎంతసేపటికీ రాకపోయేసరికి నేరుగా మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముక్కామల అప్పారావు వర్గానికి చెందిన శ్యామ్‌తోపాటు మరో 10 మంది వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"అక్కినేని మణికి మద్దతుగా తెలుగుదేశం నేత ఆలపాటి రాజా.. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఎన్నారై ఆసుపత్రిలో అరాచకశక్తులు ప్రవేశించి అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. మణికి రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. NRI ఆసుపత్రి వ్యవహారంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించినా.. పోలీసులు 41 నోటీస్ ఇవ్వటం దారుణమన్నారు. మణి పోలీస్‌స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కటువుగా చెప్పారు." -ఆలపాటి రాజా, తెదేపా నేత
ఫిర్యాదు చేసిన అనంతరం.. NRI ఆసుపత్రికి చేరుకున్న మణిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తొలుత అనుమతి లేదని చెప్పిన సిబ్బంది.. కాసేపటి తరువాత అనుమతించారు. బయటపడేసిన సామగ్రి తీసుకుని ఆమె విజయవాడ వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:
Flash: రామచంద్రాపురం తీరంలో విషాదం..ముగ్గురు యువకులు గల్లంతు