శస్త్రచికిత్స పేరు వింటేనే భయం కలగడం సహజం. ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇలాంటి సమయాల్లో వైద్యులిచ్చే భరోసా, ప్రవర్తించే తీరు రోగిలో ధైర్యాన్నిస్తాయి. సరిగ్గా ఇలాంటి ప్రయత్నమే చేసి ఓ అరుదైన శస్త్రచికిత్స చేశారు గుంటూరు జీజీహెచ్‌లో సర్జన్‌గా పనిచేస్తున్న హనుమ శ్రీనివాసరెడ్డి.
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళకు... తలలో గడ్డ ఉందని తేలింది. తక్షణమే ఆపరేషన్ చేసి తొలగించాలని జీజీహెచ్ వైద్యులు నిర్ణయించారు. 'ఇంట్రా ఆపరేటివ్ న్యూరో నేవిగేషన్' విధానం ద్వారా రోగి మేల్కొని ఉండగానే ఈ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. దీనికి ఆమె భయపడగా ధైర్యం చెప్పేందుకు కొత్తగా ఆలోచించారు డాక్టర్ హనుమశ్రీనివాసరెడ్డి.
ఆమెకు బాహుబలి-2 చిత్రం అంటే ఇష్టమని తెలుసుకుని ఆపరేషన్ థియేటర్‌లోనే ల్యాప్‌టాప్‌లో ఆ సినిమా చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తిచేశారు. దీనికి 'నావెల్ సినిమా థెరపీ' అని పేరుపెట్టారు. రోగికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గంటన్నరలోనే ఆపరేషన్ పూర్తిచేశామని వైద్యుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. 2017లో చేసిన ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను జీజీహెచ్ అధికారులు ఇంటర్నేషనల్ ఆర్గనేజేషన్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ జర్నల్‌కు పంపగా తాజా సంచికలో ప్రచురితమైంది.
'ఇంట్రా ఆపరేటివ్ న్యూరో నేవిగేషన్' విధానంలో ఇటీవలే 12 శస్త్రచికిత్సలు నిర్వహించామని జీజీహెచ్ అధికారులు తెలిపారు. 'నావెల్ సినిమా థెరపీ' విధానం సత్ఫలితాలిస్తోందని చెబుతున్నారు.
ఇదీ చదవండీ... అప్పు తీర్చలేదని తండ్రీ కొడుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు!