ఖరీఫ్ సీజన్ ప్రారంభమవడంతో గుంటూరు జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, పురుగుమందుల కంపెనీలు, నిల్వ కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. శుక్రవారం ఉదయాన్నే 11 బృందాలుగా విడిపోయిన అధికారులు... జిల్లావ్యాప్తంగా సోదాలు చేశారు. ఒక్కొక్క బృందంలో ఒక సహాయ సంచాలకులు, ఇద్దరు మండల వ్యవసాయాధికారులు ఉన్నారు. శుక్రవారం ఉదయాన్నే అందరినీ గుంటూరుకు పిలిపించి ముందస్తు ప్రణాళికను వివరించి ఎవరెవరు ఎక్కడ ఏమేం చేయాలో స్పష్టంగా చెప్పి వెంటనే తనిఖీలకు పంపారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించకపోవడం, అనుమతులకు సంబంధించిన పత్రాలు చూపకపోవడం, ధరలు పట్టిక, గోదాములకు అనుమతి తీసుకోకపోవడం వంటి కారణాలతో సుమారు రూ.90కోట్ల విలువైన సరకు అమ్మకాల నిలుపుదల చేశామని సంయుక్త సంచాలకులు విజయభారతి తెలిపారు.
విత్తన కంపెనీలు, పురుగు మందుల నిల్వ కేంద్రాల్లో తయారీ, సరఫరా వివరాలు తీసుకున్నారు. ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు జరగడం, గోదాముల్లో క్షుణ్నంగా పరిశీలించి రికార్డులకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా? లేదా? అని ఆరా తీయడంతో అనేక లోపాలు గుర్తించారు. ఏటా నకిలీలు, కల్తీలు ఏదో ఒక రూపంలో వెలుగులోకి వస్తుండటంతో వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది ముందస్తుగానే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి తనిఖీలకు పంపారు. సోదాలను పర్యవేక్షించిన వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు సాయిలక్ష్మి శనివారం కూడా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.