పౌరులు అదృశ్యం అవుతుంటే... వారు ఎక్కడున్నారో కనుగొనడంలో అలసత్వం వహిస్తున్నారని గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త కోటేష్‌ను కోర్టులో హాజరుపరిచేలా మంగళగిరి పట్టణ పోలీసులను ఆదేశించాలని అభ్యర్థిస్తూ... సరోజు అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో పోలీసులు పిలిపించినప్పటి నుంచి తన భర్త కనిపించకుండా పోయారని కోర్టుకు విన్నవించారు.
కోటేష్ ఎక్కడున్నారో పోలీసులు కనుగొనకపోవడంపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తంచేసింది. కనిపెట్టేందుకు కనీస ప్రయత్నం చెయ్యలేదని మండిపడింది. కోటేష్పై ఫోర్జరీ కేసు నమోదు చేయడానికి పోలీసుల వద్ద ఉన్న ఆధారాలేంటని ప్రశ్నించింది. వివరణ ఇచ్చేందుకు గుంటూరు అర్బన్ ఎస్పీ హాజరు కావాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలను చూస్తుంటే జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉన్నాయో అర్థం చేసుకోగలమని వ్యాఖ్యానించింది.
పోలీసులు చట్ట నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలి కానీ... ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కుదరదని ధర్మాసనం పేర్కొంది. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తిని కనుగొనలేకపోయామని రాజ్యాంగ దినోత్సవం రోజున చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని పేర్కొంది. పోలీసులు తీరు మార్చుకోకుంటే తదుపరి విచారణకు ఐజీని... ఆ తర్వాత విచారణకు డీజీపీని పిలిపించి వివరణ కోరాల్సి ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ... కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకి కనుగొంటామని, పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయడానికి స్వల్ప గడువు కావాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి : 'రాజధానిని బొత్స శ్మశానంతో పోలుస్తారా... క్షమాపణ చెప్పాల్సిందే'