గుంటూరు నగరపాలక సంస్థలో రోజూ 400 టన్నులకు పైగా చెత్త పోగవుతుంది. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, వాహనాల్లో డంపింగ్ యార్డుకు తరలించటం నగరపాలక సంస్థకు భారంగా మారింది. అందుకే చెత్తను సద్వినియోగం చేసుకునేలా హోం కంపోస్టు విధానాన్ని అమలు చేయాలని భావించింది. దీని ద్వారా తడిచెత్త నుంచి ఇంట్లోనే ఎరువుల తయారీని ప్రోత్సహించింది. ఇప్పటికే నగరంలోని 15వేల నివాసాల్లో ఈ విధానం అమలవుతోంది.
చెత్త సేకరణకు వ్యయం రోజురోజుకీ పెరుగుతున్నందున.. అందుకు ఛార్జీలు వసూలు చేయాలనే ప్రతిపాదన కూడా ఎప్పటినుంచో ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. నగరాలు, పట్టణాలను స్వచ్ఛంగా తయారు చేసేందుకు అవసరమైన కార్యక్రమాన్ని క్లీన్ ఏపీ కింద చేపట్టనున్నారు.
గతంలో కంటే మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలనేది ఈ కార్యక్రమం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆరోగ్యానికి ప్రాధాన్యం పెరిగింది. నగరం స్వచ్ఛంగా ఉంటే ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. ఇక 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారం యూజర్ ఛార్జీలు వసూలు చేసుకునే అవకాశం సంబంధిత స్థానిక సంస్థలకు ఉంది. ఇపుడు ఆ నిబంధనల మేరకు యూజర్ ఛార్జీల వసూలుకు కార్యాచరణ సిద్ధమైంది. దీనికోసం నగరంలోని రెండు వార్డులను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.
యూజర్ ఛార్జీల వసూలుకు సంబంధించి పాలకమండలి అనుమతి తీసుకోవాల్సి ఉంది. కొవిడ్ కారణంగా ప్రస్తుతం సమావేశం నిర్వహించే పరిస్థితి లేదు. అందుకే ప్రయోగాత్మకంగా రెండు వార్డుల్లో ప్రారంభించారు. పాలకమండలి సమావేశంలో నిర్ణయం తర్వాత నగరమంతా యూజర్ ఛార్జీల విధానం అమలు చేయనున్నారు.
ఇదీ చదవండి: