గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలో వరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తెల్లారితే పెళ్లి జరగాల్సి ఉండగా వరుడిని అరెస్టు చేసిన పోలీసులు.. వేరే యువతితో వరుడు ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు తెలిపారు. పవన్ పెళ్లి గురించి తెలిసి ప్రియురాలు పెదపలకలూరులో ఇంజినీరింగ్ కళాశాల పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. యువతికి తీవ్ర గాయాల కావడంతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. యువతి ఆత్మహత్యాయత్నం కేసులో వరుడు పవన్ అరెస్టు చేశామని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే..?: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పాత రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పవన్ కుమార్... అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపించాడు. అయితే పవన్ కుమార్ తల్లిదండ్రులు కట్నం కోసం చుండూరు మండలం ఆలపాడు గ్రామానికి చెందిన మరో యువతితో సంబంధం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలిక.. తాను పరీక్ష రాసే పెదపలకలూరు ఇంజనీరింగ్ కాలేజీ వరకు రావాలని పవన్ కుమార్కు ఫోన్ చేసింది. గంట గడిచినా అతడు రాకపోవడంతో అదే భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి ఇచ్చిన సమాచారంతో ఆదివారం రాత్రి పవన్ కుమార్ అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం ఉదయం పవన్ కుమార్కు వివాహం జరగాల్సి ఉంది. దీంతో.. వధువు తరఫు బంధువులు.. విడిది ఇంటికి చేరుకున్నారు. తీరా పెళ్లి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకుని.. వివాహం రద్దు చేసుకుందామని నిర్ణయించారు. ముందుగా ఇచ్చిన కట్నం డబ్బులు రూ.2.25 లక్షలు వెనక్కు ఇవ్వాలని వధువు తరఫు బంధువులు కోరారు. పవన్ కుమార్ తల్లిదండ్రులు తమ వద్ద లేవని చెప్పడంతో.. పెళ్లి కోసం వచ్చిన బంధువులంతా చేబ్రోలు-ముట్లూరు రహదారిపై ధర్నాకు దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇరు వర్గాలకు సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.
ఇవీ చదవండి: