ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు దారితీసేలా ఆధార్ కార్డుల్లో వివరాలు మారుస్తున్న 9 మంది వ్యక్తుల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు - మంగళగిరి రోడ్డులో గది అద్దెకు తీసుకొని, కంప్యూటర్లు ఇతర పరికరాల ద్వారా ఆధార్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే వందలాది ఆధార్ కార్డుల్లో అక్రమంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆధార్‌లో వయసు మార్చటం ద్వారా ప్రభుత్వ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందుతున్నారు. ఇలా ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న కొందరి ఆధార్ కార్డులపై అధికారులకు అనుమానం వచ్చింది.
పోలీసుల సాయంతో వారిని గట్టిగా నిలదీస్తే ఆధార్ వివరాల మార్పుల విషయం బయటపడింది. దీంతో అనధికారికంగా ఆధార్ మార్పులు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ ఎంతమంది ఆధార్ కార్డుల్లో మార్పులు చేశారు, కార్డులు ఎందుకోసం ఉపయోగించారు తదితర వివరాలు సేకరిస్తున్నారు.
ఇదీ చదవండి : ఆ అధికారులపై నిర్దిష్ట కాలంలో చర్యలు తీసుకోవాలి: సీఎం