గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక.. వైకాపా నేతలు పల్నాడు ప్రాంతం నుంచి వేలాది మందిని తీసుకువచ్చి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. గుంటూరు 50వ డివిజన్ తెదేపా కార్పొరేట్ అభ్యర్థి విజయ్ కిరణ్ పై వైకాపా నేతలు దాడిని ఖండిస్తూ...తెదేపా నేతలు తెనాలి శ్రావణ్ కుమార్, నసిర్ అహమ్మద్, కోవెలమూడి రవీంద్ర, చిట్టిబాబు, ప్రభాకర్లతో కలసి గల్లా.. అరుండల్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు, కిడ్నాప్ లు చేసి గెలిచిన వైకాపా నేతలు.. అదే మాదిరిగా మున్సిపల్ ఎన్నికలు కూడా గెలవాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అర్ధరాత్రి 50వ డివిజన్లో వైకాపా నేతలు డబ్బులు పంచారని.. తమ అభ్యర్థి వెళ్లి అడ్డుకుంటే.. అతని పైనా విచక్షణ రహితంగా దాడి చేశారన్నారు. డబ్బులు పంచిన వైకాపా నేతలను పోలీసులు వదిలివేసి.. వారిని అడ్డుకున్న తెదేపా అభ్యర్థిని పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని విమర్శించారు. పల్నాడు వాళ్ల చేత ఓటర్లను, స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా నేతలు అరాచకాలు, దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఆందోళన ఉద్రిక్తం