గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని సముద్ర తీర ప్రాంతమిది. లంకవానిదిబ్బతో పాటు సమీప గ్రామాలవారికి మత్స్య సంపదే ప్రధాన ఆదాయమార్గం. సముద్రంలోకి వెళ్లటం, చేపలు, రొయ్యలు, పీతలు పట్టుకుని రావటం వారి దినచర్యలో భాగం. లంకవానిదిబ్బ నుంచి సముద్రంలోకి వెళ్లటానికి 6 కిలోమీటర్లు నదిమార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత కృష్ణా నది సముద్రంలో కలుస్తుంది. మొగగా పిలిచే ఈ ప్రాంతం నుంచే మత్స్యకారులు బోట్లలో చేపల వేటకు వెళ్తుంటారు. ఇటీవలి కాలంలో వరుస వరదలతో ఈ ప్రదేశంలో ఇసుక మేటలు భారీగా పేరుకుపోయాయి. ఫలితంగా పడవల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
సముద్రం పోటు మీద ఉన్నప్పుడు మాత్రమే రాకపోకలు సాధ్యమని మత్స్యకారులు అంటున్నారు. పోటు సమయం ముగియగానే రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. పడవలు అటుగా వస్తే మేటలు తగిలి ఆగిపోతున్నాయని వాపోతున్నారు. పేరుకుపోయిన ఇసుక మేటలు తొలగించాలంటూ ఇప్పటికే మత్స్యకారులు అధికారులను కోరారు. 5 గ్రామాలు, వేలాది మత్స్యకార కుటుంబాలకు చేపలవేటే ప్రధాన వృత్తి కాబట్టి త్వరగా సమస్య పరిష్కరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు విఙ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీచదవండి