వాణిజ్య పంటల కేంద్రమైన జిల్లాలో పత్తి పంట వేసేందుకు ఏటా రైతులు ప్రాధాన్యమిచ్చేవారు. జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లు దీని సాధారణ విస్తీర్ణం. వర్షాధారంతో పాటు ఒకట్రెండు నీటి తడులు అందిస్తే దిగుబడులకు ఢోకా ఉండదు. అయితే గడిచిన మూడేళ్ల నుంచి పత్తి పంటపై గులాబి రంగు పురుగు ప్రభావం క్రమంగా పెరగడం ఆందోళన పరుస్తోంది. బీటీ విత్తనాలతో గరిష్ఠంగా ఎకరాకు 18 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల దిగుబడులు వచ్చేవి. ఇప్పుడు అది సగానికి సగం పడిపోయింది. పెట్టుబడి రెట్టింపునకు చేరింది. ఈ నేపథ్యంలో పంట వేసేందుకు రైతులు వెనకాడుతున్నారు. గతంలో ఎకరాకు ముందస్తు రూ.15 వేలు చెల్లించి పొలం తీసుకునేవారు. ప్రస్తుతం రూ.10 వేలకు అటుఇటుగా పలుకుతుంది. ఎంత లేదన్నా ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.2 వేల వరకు కౌలు రేటు పడిపోయింది. భూ యజమానులు బతిమలాడి కౌలుదారులకు అప్పగించాల్సిన పరిస్థితి. పత్తి సాగు చేసే భూములు ఎక్కువ శాతం ఖాళీ దుక్కులుగా దర్శనమిస్తున్నాయి. కంది, అపరాలు, ఇతర పంటలు వేసే పొలంలోనూ కర్షకులు దుక్కులు దున్ని సన్నద్ధం చేసే పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదు. దీని వల్ల ఆ భూముల కౌలుకు అంత డిమాండ్ లేకుండా పోయింది.
ఎకరా రూ.40 వేలు
సాగునీటి వసతి ఉన్న సారవంతమైన భూముల్లో మిరప పంట వేసేందుకు రైతులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కౌలు రేటు పలుకుతుంది. పెద్దకూరపాడులోని లగడుపాడు రోడ్డు వైపు ఎకరా రూ.40 వేలు పలికింది. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పాలెంలోనూ అంతే మొత్తం ముందస్తుగా చెల్లించారు. గతేడాది ఇదే ఎకరా భూమికి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు మాత్రమే ఉంది. ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.5 వేలు కౌలు పెరిగింది. జిల్లాలోని అన్నీ గ్రామాల్లో మిరప భూములకు కౌలు రేటులో ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తోంది. ముగిసిన ఏడాది మిరప పంటకు వైరస్ తగ్గడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఎకరాకు సగటున 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మిరప కాయల రేటు క్వింటాకు రూ.16 వేలు ఉన్న సమయంలో ముందస్తుగా కౌలు చెల్లించి రైతులు భూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జిల్లాలో మిరప పంట సాధారణ విస్తీర్ణం 71,782 హెక్టార్లను ఈసారి మించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే నారు మడులు పోసేందుకు రైతులు విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు - సెప్టెంబరు నాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మిరప సాగు మరింత జోరందుకోనుంది.
ఇదీ చూడండి..