మాజీ మంత్రి, తెదేపా శాసనసభ్యుడు అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో ఆయనను గుంటూరు రమేష్ ఆసుపత్రి నుంచి వేరే ఆసుపత్రికి తరలించే అవకాశముంది. ప్రస్తుతం ఆయన గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రమేష్ ఆసుపత్రి నాన్ కొవిడ్ ఆసుపత్రి.. సాధారణంగా కొవిడ్ నిబంధనల ప్రకారం నాన్ కొవిడ్ ఆసుపత్రిలో ఉన్నవారికి పాజిటివ్ గా నిర్ధరణ అయితే వారిని సమీపంలోని కొవిడ్ ఆసుపత్రికి తరలించాలి. ఇప్పుడు అచ్చెన్నాయుడిని ఎక్కడకు తీసుకెళ్లాలనే దానిపై అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆయన రిమాండ్ ఖైదీ కాబట్టి.. జైళ్ల అధికారులు హైకోర్టుకు విషయం విన్నవించారు. కోర్టు ఆదేశాల మేరకు అచ్చెన్నను తరలించే అవకాశాలున్నాయి.
ఈఎస్ఐ వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి కేసులో అనిశా అధికారులు జూన్ 12న అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రమేష్ ఆసుపత్రిలో చికిత్సకు హైకోర్టు అనుమతించింది. నెల రోజులకు పైగా ఆయన రమేష్ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జలుబు చేసినట్లు చెప్పటంతో ఎందుకైనా మంచిదని కొవిడ్ నిర్ధారణ పరీక్ష కూడా చేయగా పాజిటివ్ గా తేలింది. చికిత్స అందిస్తున్నట్లు రమేష్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వారానికోసారి ఆసుపత్రి నుంచి హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: