EMT Suicide Attempt: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం గుడిబండవారి పాలేనికి చెందిన లక్కీపోగు సిద్ధార్థ బీఫార్మసీ పూర్తి చేశాడు. గత నాలుగు నెలల క్రిందట తెనాలి పాత గవర్నమెంట్ ఆసుపత్రి పరిధిలోని అంబులెన్స్‌లో మెడికల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్(ఈఎంటి)గా విధుల్లో చేరాడు. చెన్నైలో నివసిస్తున్న అతని తాత చనిపోయారు. అంతిమ సంస్కారాలకు హాజరు కావడానికి రెండు రోజులు సెలవు కావాలని పై అధికారి నాగదీప్ను కోరాడు. నమ్మడానికి వీలు లేదని, తాత చనిపోయిన ప్రదేశానికి వెళ్లి వాట్సాప్ ద్వారా లొకేషన్ షేర్ చేయాలన్నాడు. అలానే చేశాడు సిద్ధార్థ.
పై అధికారైన ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ సూపర్వైజర్ నాగదీప్ తనను నమ్మకుండా ఇబ్బందులకు గురి చేశాడని సిద్ధార్థ్ వాపోయాడు. ఇంట్లోనే ఉండి అలా చెబుతున్నావు.. విధులకు హాజరుకావాలని సూచించడంతో వెళ్లానన్నాడు. ప్రయాణంలో అలసిపోయాను.. మససు కూడా బాగాలేదు.. మరో రెండు రోజులు సెలవు కావాలని అడగ్గా ఎట్టి పరిస్థితుల్లో విధులు నిర్వహించాలని నాగదీప్ హెచ్చరించాడని వివరించాడు. ఉద్యోగంలో చేరడానికి 30 వేల రూపాయలు చెల్లించినట్లు తెలిపాడు. తనకు ప్రస్తుతం 16 వేల జీతం ఇస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా.. అత్యవసర పరిస్థితుల్లో కూడా నాగదీప్ సెలవు మంజూరు చేయకపోగా.. తనను అవమానించే రీతిలో వ్యవహరిస్తున్నాడని సిద్ధార్థ వాపోయాడు.
ఇదే ఘటన పలుమార్లు కూడా పునరావృతం అవుతుండటంతో మనస్థాపానికి గురైన సిద్ధార్థ్ శనివారం ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు అతన్ని వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేదని వైద్యులు నిర్థరించారు.
తన బిడ్డ ఆత్మహత్యాయత్నానికి కారకులైన అధికారులు తమ బిడ్డకు క్షమాపణ చెప్పి.. పూర్తిగా కోలుకునే విధంగా సహకరించాలని సిద్ధార్థ్ తండ్రి డిమాండ్ చేశారు.