స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార పార్టీ దౌర్జన్యాలు, అక్రమాల నియంత్రణలో విఫలమైన అధికారులపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్లను బదిలీ చేయాలని ఎన్నికల సంఘం కమిషనర్ రమేశ్ కుమార్ ఆదేశించారు. చిత్తూరు పరిధిలో... శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు సహా... తిరుపతి, పలమనేరు సీఐలను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, గ్రామీణ ఎస్పీ విజయరావుని ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. పల్నాడు ప్రాంతంలో వైకాపా బెదిరింపులతో ప్రతిపక్ష పార్టీలు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి నెలకొన్నా...అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా ప్రేక్షకపాత్ర పోషించటాన్ని, ఎంపీడీవో కార్యాలయాల వద్ద అధికార పార్టీ నేతల దౌర్జన్యాలనూ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. మాచర్ల ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈసీ... సీఐ రాజేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పించింది. శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన సీఐ వెంటనే సరైన చర్యలు చేపట్టలేదని భావిస్తోంది.
విపక్షాలు కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నా... నియంత్రణలో విఫలం కావటంతోనే రాజేశ్వరరావుపై వేటు పడింది. బదిలీ, సస్పెన్షన్ వేటుకు గురైన అధికారుల స్థానంలో ఆమోదయోగ్యమైన వారిని నియమించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది.
ఇదీ చదవండి : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 6 వారాల పాటు నిలిపివేత