శుక్రవారం....! సినిమా అభిమానులకు పెద్ద పండగ రోజు. సూర్యోదయం కాకముందే థియేటర్ల ముందు క్యూ కడతారు. రిలీజ్ అయ్యేది అగ్ర కథానాయకుల చిత్రాలయితే... థియేటర్ పరిసరాలంతా జాతర వాతావరణమే. సంక్రాంతి, వేసవి, దసరా సీజన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాకీసు ప్రాంగణమంతా కటౌట్లు, పోస్టర్లు, ప్రేక్షకుల హోరుతో సందడిగా ఉంటుంది. సినిమా హిట్టైతే వారమంతా అదే ఉత్సాహంతో వసూళ్ల వర్షం కురుస్తుంటుంది. అలాంటి ఉత్సాహం వల్లేనేమో ఏడాదికి సగటున 10 శాతం విజయాలే వచ్చినా... చిత్రసీమ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం ఒక్కసారిగా మాయమైంది. సినీ పరిశ్రమను కరోనా కాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూగబోయేలా చేసింది.
ఇప్పట్లో తెరుచుకోవటం కష్టమే...
కరోనా కాటుకు మూతపడ్డ సినిమా టాకీసుల తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. వారం వారం కొత్త సినిమాల పోస్టరతో కళకళలాడే గోడలు...ఎకెక్కిఏడుస్తున్నాయి. వైరస్ ప్రభావం తగ్గినా... లాక్ డౌన్ ఎత్తేసినా థియేటర్లు అంత త్వరగా తెరుచుకోవడం అసాధ్యమని చిత్రపరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1800ల సినిమాహాళ్ళు ఉన్నాయి...తెలంగాణలో సింగిల్ థియేటర్లు 450, మల్టీప్లెక్స్‌లు 200 ఉండగా...ఆంధ్రప్రదేశ్‌లో 1200లకు పైగానే థియేటర్లున్నాయి. హైదరాబాద్ నగరంలోనే 150కి పైగా మల్టీప్లెక్స్‌లున్నాయి. ప్రతి వారం రెండు నుంచి మూడు సినిమాలు విడుదల అయ్యేవి. ఏడాదికి 200 నుంచి 250 సినిమాలు రిలీజై వినోదాన్ని పంచేవి.
బాక్స్‌ఫీస్ బొనంజా ఇప్పట్లో లేనట్లే...
పెద్ద హీరోల సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. డబ్బింగ్ చిత్రాలు కాకుండానే కేవలం తెలుగు చిత్రాల ద్వారానే ఏడాదికి వెయ్యి నుంచి 15 వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఒక వారం ఆశించిన ఫలితం రాకపోయినా మరొక వారం వచ్చే హిట్ సినిమాతో థియేటర్లు కళకళలాడేవి. బాక్స్‌ఫీస్ కలెక్షన్ల వర్షం కురిసేది. ఒక సినిమాను కనీసం 50 లక్షలు మంది చూస్తే సుమారుగా 50కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అయితే ఇదంతా గతం. కరోనా ప్రభావంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రతివారం కొత్త సినిమాలతో కళకళలాడే థియేటర్ ప్రేక్షకులు లేక బోసిపోతున్నాయి.
మూడు నెలలుగా మూగబోయిన థియేటర్లు...
థియేటర్‌లో ఏదైనా సినిమా వందరోజులు ఆడిందంటే అదో గొప్ప విషయం. కానీ ఇప్పుడు బొమ్మలు లేక థియేటర్లన్నీ మూతపడి వందరోజులు దాటింది. మనదేశంలోనే నెలకు సగటున 250సినిమాలు వివిధ భాషల్లో తయారవుతాయి. రోజుకు 25లక్షలమంది సినిమాలు చూసేవారు. సినీరంగంలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వేసవి సీజన్ కొనసాగుతుంది. విద్యార్థులకు సెలవులు కావటంతో కుటుంబమంతా థియేటర్లకి వెళ్లేందుకు ఆసక్తి చూపించేవారు. అందుకే ఈ సీజన్‌లోని సినిమాలు మంచి వసూళ్లు సాధించేవి. ఉగాదికి ముందు నుంచే థియేటర్లు మూసివేయటంతో కీలకమైన ఈ వేసవి సీజన్‌ను నష్టపోయింది...టాలీవుడ్. ఉగాది నుంచి విడుదల కావాల్సిన సినిమాలన్నీ థియేటర్ల బంద్ కారణంగా వాయిదా పడ్డాయి.
వచ్చే సంక్రాంతి వరకూ కరోనా ప్రభావం...
సినిమా హాళ్లలో ఉండే సైకిల్ స్టాండ్‌కు సినిమా రంగానికి దగ్గరపోలికలుంటాయి. సినిమా విడుదల వ్యవహారమూ ఇలానే ఉంటుంది. ఒక సైకిల్ ఒరిగితే అన్నీ పడిపోయినట్టు... ఒక అగ్ర కథానాయకుడి సినిమా వాయిదా పడిందంటే ఆ ప్రభావం మిగతా అన్ని సినిమాలపై పడుతుంది. ఏడాదంతా వాయిదాల పర్వం కొనసాగాల్సిందే. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి, థియేటర్లు మళ్లీ తెరిచినా...విడుదలయ్యే సినిమాలెన్ని అనేదీ ప్రశ్నగానే ఉంది. సినిమాలు విడుదల కాకుంటే థియేటర్లు తెరిచినా ఉపయోగం ఉండదు. వచ్చే సంక్రాంతి వరకూ ఈ ప్రభావం కొనసాగుతుందనే ఆందోళనా సర్వత్రా నెలకొంది.
కరోనా ఎఫెక్ట్ తగ్గినా ప్రజలు తమ ఖర్చు విషయంలో ఆచితూచి వ్యవహరించేందుకు ఎక్కువ అవకాశాలున్న నేపథ్యంలో.. సినిమాపై సామాన్యులు ఎంత మేరకు డబ్బు ఖర్చు చేస్తారనేది కూడా సందేహంగా మారింది. కరోనాను పూర్తిగా కట్టడి చేయగలిగినా... ఆ భయం కారణంగా ప్రేక్షకులు కొన్నేళ్ల పాటు ధియేటర్లకు దూరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రజలు థియేటర్స్ వైపు రావడానికి మల్టీప్లెక్స్ లు, థియేటర్ల యాజమాన్యం సీట్లు తగ్గించి మనిషికి మనిషికి మధ్య గ్యాప్ ఉండేలా ఏర్పాటు చేయటంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో టికెట్ రేట్లు పెంచితే మొదటికే మోసం వస్తుందనే భయమూ లేకపోలేదు. ఇలా సీట్ల సంఖ్యను తగ్గిస్తే.. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్స్ నడుపుకోలేని పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిస్తే కొన్ని నిబంధనలు తప్పవు. సీటుకు సీటుకు మధ్య గ్యాప్ ఉండాలి. ఎయిర్‌కండీషన్‌లో థియేటర్‌ను నిర్వహిస్తే సుమారు మూడుగంటల పాటు లోపలున్న గాలే అటూ ఇటూ తిరుగుతుంది. ప్రేక్షకుల్లో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అతడు తుమ్మినా లేక దగ్గినా ప్రమాదమే. అన్ని సినిమా కథలకు సుఖాంతం ఉన్నట్లే... కరోనా మహమ్మారి వల్ల థియేటర్లను చుట్టిముట్టిన సమస్యలు తొలిగి..2020 సెకండాఫ్‌కు శుభం కార్డు పడాలని సినీ అభిమానుల సహా అందరు కోరుకుంటున్నారు.
ఇవీ చదవండి: కరోనా దెబ్బ... కూలీలుగా మారిన పట్టభద్రులు