కొవిడ్ స్వైరవిహారంతో ఆసుపత్రుల్లో పడకలే దొరకనంతగా రోగులు చేరుతున్నారు. రోజూ వచ్చే వందల కిలోల వ్యర్థాల నిర్వహణను గుంటూరు ప్రభుత్వాసుపత్రి.. కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తోంది. వ్యర్థాల రకం బట్టి వేర్వేరు రంగుల కవర్లలో వాటిని సేకరిస్తున్నారు. జీజీహెచ్ నుంచి జనవరిలో 5 వేల 178, ఫిబ్రవరిలో 5 వేల 20, మార్చిలో 5 వేల 992 కిలోల చొప్పున బయో మెడికల్ వ్యర్థాలు బయటకు రాగా.. ఏప్రిల్‌లోనూ 5వేల కిలోలు దాటింది. సాధారణంగా రోజుకు 130కిలోల దాకా వ్యర్థాల సేకరణ జరగ్గా.. కొవిడ్ సమయంలో ఇది 180 కిలోలకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. వ్యర్థాల సేకరణ, నిల్వ, తరలింపులో పక్కా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు.
కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్కుల వినియోగం అధికమవటంతో.. వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. గుంటూరు జిల్లాలో కొవిడ్ చికిత్సకు 70 ప్రైవేట్ ఆసుపత్రులు అనుమతి పొందగా.. ఇందులో కొన్ని బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను గాలికొదిలేస్తున్నాయి. అలాంటి ఆసుపత్రులపై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్ని పరిశీలించిన కలెక్టర్