ఈఎస్‌ఐ అవకతవకల ఆరోపణల పర్వంపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అవనీతి నిరోధక శాఖ అధికారులు గుంటూరు జీజీహెచ్‌లో దాదాపు 3 గంటలకు పైగా ప్రశ్నించారు. విచారణ నిమిత్తం అచ్చెన్నాయుడిని అనిశా పోలీసులకు మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం అదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా తొలిరోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు గుంటూరు సర్వజనాసుపత్రికి చేరుకున్న అధికారులు సూపరింటెండెంట్ సుధాకర్‌తో సమావేశమయ్యారు. అనంతరం జీజీహెచ్ రెండో అంతస్తులోని అచ్చెన్నాయుడు గదికి వెళ్లి విచారించారు.
మరో రెండ్రోజులు విచారణ
అచ్చెన్నాయుడిని మరో రెండ్రోజుల పాటు అనిశా అధికారులు విచారించనున్నారు. వచ్చే రెండు రోజులు ఆయన్ను విడిగానే ప్రశ్నిస్తారా... లేక మిగతా నలుగురితో కలిపి ప్రశ్నిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అనిశా డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. విచారణ సందర్భంగా ఎవరినీ ఆయన గది వైపు వెళ్లకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆసుపత్రికి తెదేపా నేతలు
ఆసుపత్రి వద్దకు తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఇతర నాయకులు చేరుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ సక్రమంగా జరపాలని వారు డిమాండ్ చేశారు. డిశ్చార్జ్ పేరుతో అర్ధరాత్రి జరిగిన హైడ్రామాను ఆయన ప్రస్తావించారు. విచారణ పేరుతో అచ్చెన్నను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
ఇదీ చదవండి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ ఎలా ఇస్తారు: రఘురామకృష్ణరాజు