గుంటూరు ఆటోనగర్‌లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరంలో జరిగిన చోరీ కేసులో నిందితుడు.. గుబిలి సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఇతర జిల్లాలోనూ చోరీ కేసులు నమోదైనట్లు గుంటూరు అర్బన్ అదనపు ఎస్పీ గంగాధరం వెలడించారు. పెద్దమనిషిలా చలామణి అవుతూ.. దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించామన్నారు.
ఆటోనగర్‌లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరంలో ఈనెల 8న దొంగతనం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణ జిల్లా పెదగొన్నూరు గ్రామం వద్ద అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. అతని దొంగతనాల చిట్టా బయటపడింది. అరెస్ట్ చేసిన అనంతరం.. రూ. 4 లక్షల నగదు, ఐరన్ రాడ్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సుబ్రహ్మణ్యంపై.. గతంలో గుంటూరు అర్బన్ జిల్లాలో 16 కేసులు, ప్రకాశం జిల్లాలో 7 కేసులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయన్నారు. దొంగతనానికి వెళ్లేటప్పుడు ఎవరికీ అనుమానం రాకుండా ఖద్దరు చొక్కా.. తెల్ల పంచ ధరించి వెళ్లడం అతడి స్టైల్ అని ఏఎస్పీ గంగాధరం వెల్లడించారు. వ్యసనాలకు బానిసైన సుబ్రహ్మణ్యం.. సునాయాసంగా డబ్బులు సంపాదించాలని గత పదేళ్లుగా దొంగతనం వృత్తిని ఎంచుకున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చదవండి:
HAL MARK: హాల్ మార్క్ నిబంధనకు నిరసనగా.. 23న స్వర్ణకారుల సమ్మె